తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఆర్మీ సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నానక్ రామ్ గూడాలోని హెచ్.జీ.సి.యల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్ రోడ్ల మూసివేత మరియు ఇతర కంటోన్మెంట్ ప్రాంత సంబంధిత అంశాలపై ప్రధానంగా చర్చించారు. దీంతోపాటు మెహదీపట్నం కంటోన్మెంట్ ఏరియాకి సంబంధించిన వరద కాల్వ వంటి సమస్యలపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో దక్షిణభారత జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ అరుణ్, పురపాలక శాఖ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్, జీహెఛ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన చేస్తున్నామని, ఇందులో భాగంగా నగరంలోని అన్ని దిక్కుల భారీ ఎత్తున రోడ్ల నిర్మాణం, విస్తరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆర్మీ ప్రాంతాలలో సైతం మౌలిక వసతుల కల్పన జరిగిందని, అయితే స్కై వేల నిర్మాణం వంటి వాటి విషయంలో కేంద్ర రక్షణశాఖ మంత్రులను, ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి, ప్రభుత్వం తరఫున అనేక సార్లు విజ్ఞప్తి చేసినా ఎలాంటి సానుకూల స్పందన రాలేదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, ఆర్మీ అధికారులకు తెలిపారు. దీంతోపాటు కంటోన్మెంట్ ప్రాంతంలో పదేపదే రోడ్లను మూసివేయడంతో మల్కాజిగిరి లాంటి ప్రాంతాల ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయకారిగా ఉంటామని ఈ సందర్భంగా ఆర్మీకి చెందిన దక్షిణభారత జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ అరుణ్, ఇతర ఉన్నతాధికారులు మంత్రి కేటీఆర్ కి హామీ ఇచ్చారు.
రోడ్ల మూసివేత అంశంపైన ప్రధానంగా చర్చించి, త్వరలోనే ఆర్మీ అధికారులు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఒక ఉమ్మడి ఇన్స్పెక్షన్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దీంతో పాటు మెహాదీపట్నం ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో బల్కాపూర్ వరద నాల విస్తరణ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మెహదీపట్నం చౌరస్తాలో తలపెట్టిన స్కైవాక్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసేందుకు సహకరిస్తామని ఆర్మీ అధికారులు తెలిపారు. గోల్కొండ గోల్ఫ్ కోర్స్ మరియు డాలర్ హిల్స్ మీదుగా నెక్నాం పూర్ వైపు లింకు రోడ్ల నిర్మాణానికి సైతం సహకరిస్తామని తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం చేపట్టే ఏ కార్యక్రమానికైనా తెలంగాణ ప్రభుత్వం, స్థానిక జీహెచ్ఎంసి, హెచ్ఎండిఏ సంస్థలతో కలిసి పని చేస్తామని ఈ సందర్భంగా మేజర్ జనరల్ అరుణ్ బృందం మంత్రి కేటీఆర్ కు హామీ ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ