ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం: మంత్రి తలసాని

Multi Super Specialty Hospital will Build at Erragadda Chest Hospital Premises - Minister Talasani

ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖలమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. త్వరలోనే హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ, సంబంధిత అధికారులతో కలిసి చెస్ట్ హాస్పిటల్ ను సందర్శించిన అనంతరం సీఎంకు సమగ్ర నివేదికను అందజేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఇటీవల చెస్ట్ హాస్పిటల్ లోని కోవిడ్ చికిత్స పొందుతున్న వారికి అందుతున్న వైద్య సేవలను తెలుసుకునేందుకు హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి సందర్శించారు. అక్కడి పరిసరాలను పరిశీలించిన తానూ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ప్రాధాన్యతను సీఎంకు వివరించినట్లు మంత్రి తలసాని తెలిపారు. ఈ మేరకు చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ తో మంగళవారం తన కార్యాలయంలో చెస్ట్ హాస్పిటల్ విస్తీర్ణం, నిర్మాణాలు తదితర అంశాలను చర్చించినట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, పటాన్ చెరువు, జూబ్లీహిల్స్, సనత్ నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల ప్రజలకు అతి చేరువలో మెరుగైన వైద్యసేవలు అందించవచ్చని అన్నారు.

పేదప్రజలకు సైతం కార్పోరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్య సేవలు అందించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ వైద్య సేవలను విస్తరించే కార్యక్రమంలో భాగంగా ఇటీవల సీఎం నూతనంగా ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను గుర్తు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా అనేక మందికి వైద్య సేవలు అందిస్తున్న ఎర్రగడ్డ లోని చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో కూడా గాంధీ తరహాలో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని చెప్పారు.

సుమారు 62 ఎకరాల విస్తీర్ణంలో కేవలం 18 ఎకరాల విస్తీర్ణంలో చెస్ట్ హాస్పిటల్ నిర్మాణాలు ఉన్నాయి. ఇంకా సుమారు 44 ఎకరాల భూమి అందుబాటులో ఉంటుందని, ఇందులో అత్యాధునిక వసతులు, సౌకర్యాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తే పేద ప్రజలకు అనేక రకాల వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నగరంలో ఎప్పుడు రోగులతో రద్దీగా ఉండే గాంధీ, నిమ్స్, ఉస్మానియా వంటి ప్రధాన హాస్పిటల్స్ పై వత్తిడి ని తగ్గించవచ్చని వివరించారు. అలాగే నూతనంగా ప్రభలే పలు రకాల వ్యాధులను గుర్తించేందుకు అత్యాధునిక మెడికల్ రీసర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు. మెడికల్ రీసర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడం వలన కరోనా వంటి నూతన వైరస్ లు ప్రభలితే వ్యాధుల నిర్ధారణ పరీక్షల కోసం ఇతర రాష్ట్రాల పై ఆధారపడాల్సిన అవసరం ఉండదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =