కాంగ్రెస్ పార్టీ కీలకనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహిస్తున్న “రైతు సంఘర్షణ సభ” సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటనను తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగే “రైతు సంఘర్షణ సభ”కు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాకా రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలిసారి. ముందుగా ఈ సభకై జన సమీకరణ కోసం జిల్లాల వారిగా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబం నుంచి ఒక్కరు చొప్పున సభకు రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభకు 5 లక్షల మందికిపైగా హాజరు కానున్నట్టు తెలుస్తుంది.
వేదిక సమీపంలో ప్రముఖ నేతలకు, జిల్లాల నుంచి తరలివచ్చే వారికోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. మరోవైపు మైదానంలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ సహా ముఖ్య నేతల కోసం ఒకటి, రైతులు, కళాకారుల కోసం మరో రెండు వేదికలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఈ సభలో ప్రసంగం సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులను ఆదుకోవడం కోసం చేపట్టబోయే కార్యక్రమాలు, నిర్ణయాలపై రాహుల్ గాంధీ డిక్లరేషన్ చేయనున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ, మద్దతు ధర, ప్రతి ఏడాది వరి సేకరణ వంటి అంశాలపై రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్:
మే 6, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో వరంగల్ చేరుకుని, ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల తరువాత సభను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నట్టు తెలుస్తుంది. ఇక సభ ముగిసాక వరంగల్ నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ చేరుకుని, బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో బస చేయనున్నారు.
మే 7, శనివారం మధ్యాహ్నం హోటల్ తాజ్‌కృష్ణ నుంచి సంజీవయ్య పార్కు వద్దకు చేరుకొని, దివంగత మాజీ సీఎం దామోదరం సంజీవయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి గాంధీభవన్ కు చేరుకొని దాదాపు 200 మంది కీలక నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కాంగ్రెస్ ను బలోపేతం చేయడం, ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు, అలాగే డిజిటల్ సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్లతో రాహుల్ గాంధీ ఫోటో సెషన్‌లో పాల్గొంటారు. ఇక సాయంత్రం 4 గంటలకు పర్యటన ముగించుకుని, గాంధీభవన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకొని, ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ