ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి నారాయణకు బెయిల్ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో ఆయనకు చిత్తూరు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. పదవ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసులో నారాయణను మంగళవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి చిత్తూరుకు తరలించారు. మంగళవారం రాత్రి నారాయణను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. ఈ క్రమంలో నారాయణ గ్రూపు విద్యాసంస్థల అడ్మినిస్ట్రేటివ్ విధుల నుంచి 2014లోనే పి.నారాయణ తప్పుకున్నారని, ఇప్పుడు ఆ కాలేజీలతో ఆయనకు సంబంధం లేదని నారాయణ తరపు న్యాయవాదులు పేపర్లతో సహా రుజువులను న్యాయమూర్తికి చూపించారు. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసులో ఇరికించారని మాజీ మంత్రి తరఫు న్యాయవాదులు మెజిస్ట్రేట్‌కు విన్నవించారు.
దీంతో నారాయణ తరఫు న్యాయవాదులు జ్యోతిరావు, రామకృష్ణ వాదనలను పరిశీలించిన చిత్తూరు స్థానిక మేజిస్ట్రేట్ పోలీసుల అభియోగాన్ని తోసిపుచ్చింది. కాగా ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు నారాయణను ప్రధాన కుట్రదారుడిగా పేర్కొన్నారు. అయితే నారాయణ తరపున లాయర్లు సమర్పించిన సాక్ష్యాలను అధ్యయనం చేసిన తర్వాత పోలీసుల వాదనను న్యాయమూర్తి నిరాకరించారు. ఆరోపణలు నిరాధారమైనవని, నేరం జరిగినప్పుడు నారాయణ ఛైర్మన్‌గా లేరన్న లాయర్ల వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. దీంతో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఈ నెల 18లోగా లక్ష రూపాయల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించారు. అనంతరం నారాయణ తరపు న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ తమ ఆరోపణలను కోర్టులో నిరూపించడంలో పోలీసులు విఫలమయ్యారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ






































