భారీ వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, సత్వరమే స్పందించి ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి శనివారం లేఖ రాశారు. తెలంగాణను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయని, గత 100 ఏళ్లలో ఇదే అత్యధికం అని లేఖలో పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం దీనిని గుర్తించి జాతీయ విపత్తుగా ప్రకటించాలని, అలాగే సహాయక చర్యల్లో భాగంగా తెలంగాణకు రూ. 2 వేల కోట్లు వరద సాయం కూడా అందించాలని కోరారు. ఇక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద కూడా తోడవడంతో నష్టం తీవ్రత పెరిగిందని లేఖలో రేవంత్ తెలిపారు.
ప్రధానంగా భద్రాచలం ప్రాంతం ముంపు ముంగిట నిలిచిందని, అనేక గ్రామాలు జలమయం అయ్యాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 లక్షల ఎకరాల్లో పూర్తిగా పంట నష్టం జరిగిందని, చాలా చోట్ల ఇళ్ళు కూడా ధ్వంసమయ్యాయని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ఇంకా జాతీయ రహదారులు అనేకచోట్ల తెగిపోయాయని, జలాశయాలు పొంగి పొర్లుతున్నాయని ప్రధాని దృష్టికి తెచ్చారు. 14 జిల్లాల్లో పంట నష్టంతో పాటు తీవ్ర ఆస్థి నష్టం కూడా వాటిల్లిందని, వర్షాలు, వరదలు కారణంగా కొంతమంది మరణించారని, మరికొన్ని ప్రాంతాల్లో పశువులు మృత్యువాత పడ్డాయని వివరించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణను కేంద్రప్రభుత్వం తప్పనిసరిగా ఆదుకోవాలని లేఖలో రేవంత్ రెడ్డి లేఖలో కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ