తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఫిబ్రవరి 18, మంగళవారం నాడు ప్రగతిభవన్‌లో రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, కార్పోరేషన్ మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌లు హాజరయ్యారు. ఈ సదస్సులో ముఖ్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమంపై చర్చించి, అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనం చేయనున్నారు.
ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 10 రోజుల పాటుగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమ రూపకల్పన, విధివిధానాలు, ప్రభుత్వ లక్ష్యాలు, ప్రణాళికలపై అధికారులకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేయనున్నారు. ఈ సదస్సు అనంతరం అధికారులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ పర్యటనకు వెళ్లి అక్కడ శాఖాహార, మాంసాహార మార్కెట్లను పరిశీలిస్తారు.
[subscribe]

















































