టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై గురువారం రాత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించి, కీలక వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని భారత న్యాయవ్యవస్థకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన ఈ వీడియోలు చూస్తే దేశం ఎంత ప్రమాదంలో ఉందో స్పష్టమవుతుందని, ప్రజాస్వామ్యమే కాదు భారత సమాజం ఉనికే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దేశంలో పార్టీ ఫిరాయింపులు చేయాలని ఎమ్మెల్యేలను ప్రోత్సహించటం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు ప్రయత్నించేలా చేపడుతున్న చర్యలను ప్రజాస్వామ్యంలో తీవ్రంగా పరిగణించాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ తో పాటుగా సుప్రీంకోర్టు జడ్జీలు, దేశంలోని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులందరికీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వినమ్రపూర్వకంగా నమస్కారం చేసి కోరుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. లేకపోతే దేశం పూర్తిగా నాశనం అవుతుందని, ఈ వ్యవహారాన్ని ఒక సింగిల్ కేసులా చూడొద్దని న్యాయ వ్యవస్థను అభ్యర్థిస్తున్నానని అన్నారు. న్యాయవ్యవస్థ దీనిపై చర్చించి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుని, నేరం చేసినవాళ్లను తప్పకుండా శిక్షించాలని సీఎం కేసీఆర్ కోరారు. అలాగే ఈ దౌర్జన్యాన్ని ప్రజలు, యువత కూడా ఖండించాలని సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, “ఇందిరాగాంధీకి దేశంలో ఎదురులేదు అనుకున్న సమయంలో ఎమర్జెన్సీ ఆమెను ముంచింది. ఇప్పుడు బీజేపీ చేస్తున్న విధానం జుగుప్సాకరంగా ఉంది. స్వయంగా ప్రధాని పశ్చిమబెంగాల్ లో టీఎంసీ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. దేశం ఒకసారి దెబ్బతింటే వంద ఏళ్ళు వెనక్కి వెళతాం. ఇప్పటికే దేశంలో 8 ప్రభుత్వాలు కూల్చాము, మరో 4 ప్రభుత్వాలను కూల్చుతం అని ఏజెంట్లు అంటున్నారు. తెలంగాణ, ఢిల్లీ, రాజస్థాన్, ఏపీ ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్ర చేశారు. ఆ ముఠాను పట్టుకున్నాం కాబట్టే ఈ విషయాలు తెలిశాయి, వెంటనే ఢిల్లీ సీఎంను
అప్రమత్తం చేశాం. ఎన్నికల్లో కీలకమైన ఈవీఎంలపై కూడా ఈ ముఠా మాట్లాడుతోంది. ఇలాంటి దుర్మార్గం ఈ దేశంలో నడవకూడదు. దేశంలో ప్రజాస్వామ్యం రక్షించబడాలి లేకుంటే శాంతిభద్రతలకు విఘాతం అవుతుంది” అని అన్నారు.
“రాష్ట్రంలో మేము కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకున్నాం. రాజ్యాంగ బద్ధమైన నిబంధనలకు లోబడి మేము ఎమ్మెల్యేలను కలుపుకున్నాం. ఎమ్మెల్యేలను మేం కొనలేదు, నియోజకవర్గాల అభివృద్ధి కోసం కలుస్తాం అంటే చేర్చుకున్నాం. హైదరాబాద్ గడ్డ మీదకొచ్చి మా ప్రభుత్వాన్నే కూలగొడతారా?, 3/4 వంతు మెజార్టీ ఉన్న మా ప్రభుత్వాన్నే కూల్చాలని చూస్తారా?, నా ప్రభుత్వాన్ని కూలగొడుతాం అంటే నేను చూస్తూ ఉరుకోవాలా?. పార్టీలో చేరితే గోడి (సఖ్యత), లేకపోతే లేకపోతే ఈడీ అని వీడియోలో సోమయాజి అనే వ్యక్తి చెప్తున్నారు. అసలు ఈ ముఠా నాయకులు ఎవరు?, ఈ ముఠాకు డబ్బులు సమకూర్చేది ఎవరు?, అన్ని విషయాలు ఖచ్చితంగా బయటకు రావాలి. ఢిల్లీలోని ఎయిమ్స్ లో కూడా తమకు ఆఫీస్ ఉందని వీళ్ళు అంటున్నారు. 2015 నుంచి ఈ ముఠాలోని ముగ్గురి ఫోన్ కాల్ డేటా అంతా బయటకు తీశాం. వీళ్ళ డేటా వేల పేజీలలో ఉంది. వాటిని 100 మందితో విశ్లేషణ చేస్తున్నాం. దేశం ఇకనైనా కొత్త పంథా పట్టాలి. ప్రధానికి ఇలాంటి రాజకీయాలను ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దేశానికి రెండు సార్లు పీఎం అయ్యారు. ఇక నుంచైనా మంచి పనులు చేపట్టాలి. దేశంలో కూడా విద్యావంతులు, యువత మేల్కోవాలి. దేశంలో ఇంకా న్యాయం బతికే ఉంది. గతంలో ఎన్నో ప్రమాదాలు వచ్చినప్పుడు న్యాయవ్యవస్థ ఆదుకుంది. సుప్రీంకోర్టు సీజే, హైకోర్టు సీజే, న్యాయమూర్తులు అందరూ ఈ వీడియోలను పరిశీలించి, చర్యలు తీసుకోవాలి. అందరూ కలిసి యుద్ధం చేయాలి” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE