తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి సంబంధించి అసిస్టెంట్ ఇంజినీర్ రిక్రూట్మెంట్ టెస్ట్ పేపర్ సహా, ఇతర పేపర్ల లీకేజి వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుడు ప్రవీణ్ సహా మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ 9 మంది నిందితులకు మంగళవారం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులు వీరిని నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. వాదనలు తర్వాత 9 మంది నిందితులకు 14 రోజుల పాటుగా రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎనిమిదిని చర్లపల్లి జైలుకు, ఏ3 నిందితురాలు గా ఉన్న రేణుకను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉండడంతో, వారిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ మరియు సిట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు పేపర్ లీకేజి కేసును బేగంబజార్ పోలీసులు దర్యాప్తు చేయగా, ఇకపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఆధ్వర్యంలో దర్యాప్తు జరగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE