కోవిడ్-19(కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల పార్లమెంటరీ పార్టీ లీడర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8, బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషి మాట్లాడుతూ, ఏప్రిల్ 8న ఉదయం 11 గంటలకు పార్లమెంటు ఉభయ సభల్లో ఐదుగురు ఎంపీలు కన్నా ఎక్కువున్న పార్టీల ఫ్లోర్ లీడర్స్ తో ప్రధాని మోదీ సంభాషించనున్నారని చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా వైరస్ వ్యాప్తి మరియు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు, కోనసాగింపుపై చర్చించే అవకాశం ఉంది. దేశంలో లాక్‌డౌన్ ప్రకటించాక విపక్ష నాయకులతో ప్రధాని మోదీ మొదటిసారిగా చర్చించనున్నారు. మరోవైపు దేశంలో కరోనా నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులు, వివిధ అంశాలను చర్చించేందుకు ప్రధాని మోదీ ఏప్రిల్ 6న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నారు.
[subscribe]