ఏపీలో పొత్తు రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే పొత్తులు చిగురిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించేశారు. అటు పొత్తులతో క్లారిటీ కోసం పురంధేశ్వరి ఢిల్లీ పెద్దలు వద్దకు వెళ్లారు. పొత్తుల లెక్కలు తేల్చుకున్నాకే ఆమె తిరిగి రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు. ఈక్రమంలో ప్రతిపక్షాలను టార్గెట్‌గా చేసుకొని విమర్శల బాణాలు వదిలారు సీఎం జగన్మోహన్ రెడ్డి. రెండు సున్నాలు కలిసినా.. నాలుగు సున్నాలు కలిసినా.. సున్నా పెద్దదవుతుందే తప్ప ఎటువంటి ఫలితం ఉండదని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షాలు పొత్తుల కోసం ఆరాటపడుతున్నాయని జగన్ అన్నారు. ప్రతిపక్షాలను చూస్తుంటే తనకు ఆశ్చర్యం వేస్తుందని చెప్పుకొచ్చారు. ఏపీలో గతంలో పాలించిన పార్టీలు దోచుకోవడం తప్పు.. చేసిన అభివృద్ధి శూన్యమని వ్యాఖ్యానించారు. అందుకే వారికి కూడా సున్నా రిజల్టే ఇస్తారని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు కుర్చీ కోసం పోటీ పడుతున్నది ప్రజలు సేవ చేసేందుకు కాదన్న జగన్.. కేవలం వారి పొట్ట నింపుకునేందుకు మాత్రమేనని మండిపడ్డారు. ప్రతిపక్షాలది దోచుకో.. దాచుకో.. తినుకో అనే సిద్ధాంతమని చెప్పారు.
తాను అధికారంలోక వచ్చాక ఇచ్చిన మాటను తప్పలేదని జగన్ చెప్పుకొచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చానని అన్నారు. తాను ప్రజలకు చేసిన మేలు కళ్లముందే కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. అందుకే ధైర్యంగా వై నాట్ 175 అని అనగలుగుతున్నానని వెల్లడించారు. అలాగే తాను ప్రజలకు మేలుచేసే పనులు చేశాను కాబట్టే.. దేశంలో ఏ రాజకీయ నాయుడు కూడా అనలేని మాటలను అనగలుగుతున్నానని వెల్లడించారు. తనకు కుల, మత, పేద, ధనిక అనే బేధం ఉండదన్న జగన్.. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నానని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే సామాజిక న్యాయం అనేది అందరికీ తెలిసిందని చెప్పుకొచ్చారు.
తాను చేసిన మేలు ప్రతీ ఇంటిలో ఉంటే.. ఆ మంచినే కొలమానంగా తీసుకొని తనకు ఓటు వేయమని కోరుతున్నానని జగన్ వెల్లడించారు. ఏది ఏమైనా ప్రజలకు మేలు చేయడమే తన లక్ష్యమన్నారు. తాను చనిపోయినాక కూడా ప్రతి ఇంటిలో ఫొటో రూపంలో బతికి ఉండడమే తనకు కావాలని పేర్కొన్నారు. పేద వాడి చిరునవ్వులో తనను తాను చూసుకునేందుకు ఆరాట పడుతున్నానని జగన్ చెప్పుకొచ్చారు. అలాగే వచ్చే మార్చి లేదా ఏప్రిల్‌లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.