అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోన్న పింక్ సరస్సు

Pink lake
Pink lake

ఒకప్పుడు పేపర్లలో, పుస్తకాలలో, టీవీలలో ప్రపంచ ఏడు వింతలను చూసే అబ్బురపడిపోయేవారు. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెంది.. సోషల్ మీడియా జనాలకి అందుబాటులోకి వచ్చేసాక అంతకుమించి అద్భుతాలను ప్రతి రోజూ చూస్తున్నారు. ప్రపంచంలో ఏ మారుమూలనో ఉన్న చిత్రవిచిత్రాలు కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో అందరి కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి. అప్పటి వరకూ తమ పక్కన ఉన్న విషయాన్ని కూడా పట్టించుకోని వాళ్లంతా నెట్టింట్లో వైరల్ అయ్యేసరికి ఆశ్చర్యపోయే సీన్లు కూడా కనిపిస్తుంటాయి.

నిజానికి ప్రకృతి అంటేనే ఎన్నో వింతలు, విచిత్రాలకు నిలయంగా చెబుతారు.మనసు పెట్టి చూస్తేనే కానీ కనిపించని అందాలు కొన్నయితే.. కంటికి ఇంపుగా కనిపిస్తూ మనసును నింపేసే అందాలు మరికొన్ని ప్రకృతిలో మమేకం అయిపోతూ ఉంటాయి. అయితే ఇలాంటి ఎన్నో వీడియోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. అందాలను పంచడానికే ప్రకృతి ఏర్పడిందా అనే అనుమానం వచ్చేలా అడుగడుగునా అందాలతో నింపేస్తుంది. అలాగే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ పింక్ సరస్సును చూసి చాలామంది వావ్ అని అంటుంటే మరికొందమంది ఇదేంటి అలా గులాబీ రంగులో ఉందంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని వింత అంటూ వీడియోను షేర్ చేస్తూ మరింత వైరల్‌గా మారుస్తున్నారు.

రష్యాలో సైబీరియాలో గల ఆల్టై పర్వత ప్రాంతంలో ఈ గులాబీ రంగు సరస్సు ఉంది. పింక్ సరస్సు పూర్తిగా ఉప్పు నీటి సరస్సు అని స్థానికులు చెబుతారు. ఈ సరస్సులో గల ఉప్పు ప్రతి ఏడాది ఆగస్టులో గులాబీ రంగులోకి మారుతుందని..అందుకే నీళ్లు కూడా రంగు మారి పింక్ సరస్సుగా మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇందులో ఉప్పు రంగు మారటానికి కారణం.. ఆర్టెమియా సాలినా అనే సూక్ష్మజీవులేనట. ఆర్టెమియా సాలినా వల్లే ఉప్పు నీటి సరస్సు నీరు..గులాబీ రంగులోకి మారుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. అయితే ఈ వింతను చూడటానికి పర్యాటకులు క్యూ కడుతూ ఉంటారు.

నిజానికి ఆర్టెమియా సాలినా అనేది ఉప్పు నీటి రొయ్యల జాతిగా చెబుతారు. ఈ నీటి రొయ్యలు వందల సంవత్సరాలుగా ఉప్పు నీటి సరస్సు అడుగు భాగంలో నివసిస్తూ ఉన్నాయి. వీటివల్లే ఈ సైబీరియన్ పింక్ లేక్ చాలా మంది పర్యాటకులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ సరస్సు మధ్యలోంచి రైలు మార్గం కూడా ఉంది. చుట్టూ గులాబీ రంగు నీళ్లు.. మధ్యలో చుక్ చుక్ మని కదిలే రైలు బండి వెళుతుంటే పర్యాటకులు రెండు కళ్లూ చాలవంటూ పులకరించిపోతున్నారు. ఇదంతా ప్రకృతి గీసిన చిత్రంలో సినిమా సెట్‌లా ఉందని దీనిని తమ కెమెరాలలో, మొబైల్ ఫోన్స్‌లోనూ బంధిస్తున్నారు.

ప్రస్తుతం ఆ వీడియో, ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఈ పింక్ నీటి సరస్సు మధ్యలో వేసిన రైలు పట్టాలపై రైలు వెళుతుండడం చూసి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఈ సరస్సు`చాలా అద్బుతంగా ఉందని కొంతమంది అంటుంటే “ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు ఉన్నాయంటూ మరికొంతమంది కాంప్లిమెంట్లు ఇస్తున్నారు.జీవితంలో ఒక్కసారయినా గులాబీ సరస్సు మధ్య రైలు జర్నీని చేయాలనిపిస్తుందని ఇంకొంతమంది అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − sixteen =