తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. రాజకీయాలు హీటెక్కుతున్నాయి. పోలింగ్‌కు దాదాపు నెలన్నర టైముంది. నామినేషన్లకూ ఇంకా సమయముంది. కానీ.. వాడి వేడి.. ఇప్పటి నుంచే మొదలైంది. అధికార, విపక్షాలు ఒకదానిపై.. మరొకటి. . భగభగమంటున్నాయి. ప్రజలకు మంచి చేసే పథకాలు.. వారికి ఉపకరించే కార్యక్రమాలు ఆలోచించి మేనిఫెస్టో రూపొందించింది మేమంటే మేమేనని కాంగ్రెస్, బీఆర్ఎస్లు సవాళ్లు, ప్రతిసవాళ్లకు సిద్ధమయ్యాయి.
బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించాక ఈ రగడ చెలరేగింది. బీఆర్ఎస్ ఊరించి ఊరించి వెలువరించిన మేనిఫెస్టోలో కొత్త అంశమేమీ లేదని, అన్నీ మా నుంచి కాపీ కొట్టినవేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు.. ఇంకో అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో ప్రజలకు డబ్బులివ్వకుండా, మందు పోయకుండా, ప్రలోభాలు పెట్టకుండే గెలుస్తామనే నమ్మకం బీఆర్ఎస్కు లేదన్నారు. ఎరలు, ప్రలోభాలతో ప్రజలను మభ్యపెట్టి బుట్టలో వేసుకునే పనిలో పడిందంటూ ఆరోపించారు. పైసలు ఇవ్వకుండా, మందు పోయకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రమాణం చేయగలవా కేసీఆర్ అంటూ సవాల్ విసిరారు. అందుకు తాను సిద్ధంగా ఉన్నానని, 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్దకు వస్తానని నువ్వుసిద్ధమా అంటూ ప్రశ్నలు సంధించారు.
బీఆర్ ఎస్ శ్రేణులు ఘాటుగానే స్పందిస్తున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై మునిసిపల్ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఎవరైనా ఒకస్థాయి ఉన్నవారి మాటలకు విలువుంటుంది. రేపో మాపో ఎప్పుడు జైలుకు వెళ్తారో తెలియని వాళ్లు, నోట్ల కట్టలతో పట్టుబడి కేసుల్లో ఉన్న వారు సైతం సవాళ్లు విసిరే మొనగాళ్లా అంటూ తనదైన స్టైల్లో వ్యాఖ్యానంచారు. అంతేకాదు.. అసలు తాము ఇప్పటికే అమలుచేస్తున్న పథకాలనే మరికొంత విస్తరింప చేస్తున్నామని, ఈ స్కీమ్‌లు, పథకాలు తమతోనే ప్రారంభమైవని, తమనుంచే కాంగ్రెస్ కాపీ కొట్టి ఆరు గ్యారంటీలని కొత్త పేరు పెట్టుకుంటుందని కేటీఆర్ ఎదురు దాడికి దిగారు. రెండు పార్టీలూ పేదలు.. ముఖ్యంగా మహిళలకు ఉపకరించే పథకాలతో రూపొందించిన మేనిఫెస్టో మాదంటే మాదేనని వాదించుకుంటున్నాయి.
పేదలెంత అమాయకులో, వారికేదైనా చేస్తామంటే ఎంతగా నమ్ముతారో రెండు పార్టీలూ బాగానే గ్రహించినట్లున్నాయి. అందుకే మేనిఫెస్టోలోని అంశాలు బాగున్నాయనే స్పందన వెలువడిందో లేదో వాటిపై పేటెంట్ తమదంటే తమదేనని పోట్లాడుకుంటున్నాయి. ఇంతకీ ప్రజలు ఎవరిని నమ్ముతున్నారో, ఎవరివి బూటకపు మాటలుగా పరిగణిస్తున్నారో పోలింగ్ తర్వాతే తేలనుంది. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రెండూ పోటీలు పడుతున్నా బీజేపీ ఇంకా ఎలాంటి మేనిఫెస్టో ప్రకటించలేదు. మౌనంగా తనపనిలో తానుంది. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపై దష్టి సారించినట్లు తెలుస్తోంది. త్వరలోనే బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రంటో పర్యటనకు రానున్నారు. ఆలోగా బీజేపీ మేనిఫెస్టో వెలువడుతుందేమో, అదెలాంటి వరాలు ప్రకటించనుందో చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE