ముందు నుంచి వస్తున్న ఊహాగానాలే నిజమయ్యాయి. విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా పార్టీ వ్యవహారాలకు కూడా దూరంగా ఉండాలని ఆదేశించింది. అయితే ఈ పరిణామాన్ని కేశినేని నాని ముందే ఊహించారు. తనకు ఈసారి టికెట్ దక్కదని ముందే ఫిక్స్ అయ్యారు. అందుకే టీడీపీ అధిష్టానానికి, పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలకు కేశినేని నాని దూరంగా ఉంటూ వస్తున్నారు. అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
2019 ఎన్నికలు ముగిసిన తర్వాత కేశినేని నాని, తెలుగు దేశం పార్టీ అధిష్టానికి మధ్య చెడింది. అప్పటి నుంచి నాని టీడీపీ హైకమాండ్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. బహిరంగంగానే టీడీపీ హైకమాండ్‌పై నాని పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీలో నారా లోకేష్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తన మాటకు విలువ ఇవ్వలేదని ఆరోపించారు. ఒకానొక సమయంలో అయితే.. ఏకంగా వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలిచే ప్రసక్తే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా విజయవాడలోని టీడీపీ సీనియర్లతో కూడా కేశినేని నానికి సంత్సంబంధాలు లేవు. బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలతో నానికి విబేధాలు ఉన్నాయి. అలాగే ఇటీవల జరిగిన నారా లోకేష్ యువగళం పాదయాత్రకు కూడా కేశినేని నాని సహకరించలేదు. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు ఆ పాదయాత్రలో పాల్గొంటే కేశినేని నాని మాత్రం ఎక్కడా కనిపించలేదు. అలా ముందు నుంచి కూడా కేశినేని నాని టీడీపీ హైకమాండ్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. అటు టీడీపీ హైకమాండ్ కూడా నానికి ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చింది.
ఇప్పుడు ఏకంగా నానికి టికెట్ ఇచ్చేది లేదని హైకమాండ్ తేల్చేయడంతో.. నాని ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో ఓసందర్భంలో మరోసారి తనకు టీడీపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని నాని ప్రకటించారు. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా కేశినేనికి ఆఫర్లు వచ్చాయని గుసగుసలు వినిపించాయి. వైసీపీలో చేరేందుకు నాని కూడా సిద్ధమయ్యారని ఆప్పట్లో వార్తలొచ్చినప్పటికీ.. చివరికి అది జరగలేదు. మరి ఇప్పుడు నాని ఏ నిర్ణయం తీసుకుంటారు?.. వైసీపీలో చేరుతారా?.. లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా?.. అన్నది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY