అవినీతిలోనూ ఎదిగారా..? సోమేశ్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

Somesh kumar, EX CS Somesh, Telangana, Somesh, Rythubandhu, pharmacity, GHMC, GHMC comissioner, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Mango News Telugu, Mango News
Somesh kumar, EX CS Somesh, Telangana

ఆయ‌న‌కు స్ట్రిక్ట్‌ ఆఫీసర్ అనే పేరు. ప‌నిలో నిబ‌ద్ద‌త‌.. కార్య‌ద‌క్ష‌త‌తో అంచెలంచెలుగా ఉన్న‌త స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఆయ‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఉన్న‌త ప‌ద‌వులో ఉన్న ఆయ‌న‌.. భ‌ విష్య‌త్ లో భారీ ప్రాజెక్టులు వ‌స్తాయ‌ని ముందే గుర్తించి.. ఆ ప‌రిస‌రాల్లోని భూమిని కారుచౌక‌గా కొన్నార‌ని.. .ప్రత్యక్షంగా అధికార దుర్వినియోగం చేయకున్నా.. పరోక్షంగానైనా  రాబోయే ప్రయోజనాన్ని ఆశించే ఇలా చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎక్కడో గిరిజన సంక్షేమశాఖ వంటి విభాగాల్లో  ఉండి ఎవరికీ తెలియకుండా ఉన్న ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు.. తర్వాత కీలకంగా మారారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు..తర్వాత బల్దియా కమిషనర్‌గా, స్పెషలాఫీసర్‌గా పనిచేసి అందరి దృష్టిలో పడ్డారు. అనంత‌రం సీఎస్‌గా ఎదిగారు. అంతే కాదు కేసీఆర్‌ సీఎంగా ఉన్నంతకాలం సీఎస్‌గా  ఆయన హవా సాగింది.

 సోమేశ్ కుమార్‌ ఐఏఎస్ పూర్తి చేసిన త‌ర్వాత‌..  బోధన్, నిజామాబాద్ సబ్ -కలెక్టర్‌గా పని చేశారు. ఆ త‌ర్వాత‌.. అనంతపూర్ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. 2014లో రాష్ట్ర విభజించినప్పుడు ఏపీ క్యాడర్ కు కేటాయించిన కేంద్రం పరిపాలన ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులతో ఆయన తెలంగాణ రాష్ట్రంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీ తొలి చీఫ్ కమిషనర్‌గా నియమితుడయ్యారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, 5 రూపాయలకు భోజనం వంటి పథకాలతో మంచి పేరు సంపాదించారు. ఆయన 2015లో జీహెచ్ఎంసీ పరిధిలో 7 లక్షల ఓట్లు గల్లంతైన సందర్భంలో ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసింది. సోమేశ్ కుమార్‌ను ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖల ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఆయన అదనపు సీఎస్ హోదాలో ఉన్న సమయంలో 2023 డిసెంబర్ 31న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో సోమేష్‌ కుమార్‌ను ఏపీకీ కేటాయించడంపై ఆయన కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాడు. సోమేశ్ కుమార్ తెలంగాణలోనే కొనసాగుతానంటూ కేంద్ర పరిపాలన ట్రైటునల్ (సీఏటీ)ను కోరగా సీఏటీ ఉత్తర్వులు జారీ చేసింది. సీఏటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ 2017లో కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభ్యంతరాల నేపథ్యంలో చీఫ్‌జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సూరేపల్లి నందా నేతృత్వంలో విచారణ జరిపారు. అనంత‌రం అన్ని వాదనలు విన్న తరువాత తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపును 2023 జనవరి 10న రద్దు చేసింది. ఆయనను తెలంగాణ క్యాడర్ నుంచి రిలీవ్ చేసి జనవరి 12 లోపు ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో చేరాలని హైకోర్టు ఆదేశించింది. ఆయ‌న చేర‌కుండా ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెలంగాణ‌లో నాటి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌ధాన స‌ల‌హాదారుగా చేరారు.

ఇదిలాఉండ‌గా.. భవిష్యత్‌లో ధరలు పెరుగుతాయని తెలిసి పేదల భూములు కారుచవకగా కొని అమాంతంగా ఇప్పుడు కోటీశ్వరులయ్యే వారి  జాబితాలో ఆయన పేరూ చేరింది. ఆయన భార్య డాక్టర్‌ జ్ఞానముద్ర పేరిట దాదాపు 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. వారు కొన్నప్పుడు దాని ధర ఎకరా రూ.2.5 లక్షలు. సమీపంలో కొత్తగా ఫార్మాసిటీ  ఏర్పాటు కానుందని తెలిసినందునే కొన్న  చాలామందిలో ఆయన కూడా ఉన్నారు. మిగతా వారికంటే  ముందే  రాబోయే ప్రాజెక్టుల గురించి ఎక్కువగా తెలిసే అవకాశం ఉంది. అయితే.. తాను అంతా చట్టం,నిబంధనల మేరకే చేశానని సోమేశ్‌కుమార్‌ పేర్కొంటున్నారు. ప్రభుత్వానికి కూడా  ఆ వివరాలు అప్పుడే తెలిపానని, ప్రశాసన్‌నగర్‌లో ఉన్న ఇంటిని అమ్మ‌గా వ‌చ్చిన డ‌బ్బుతో కొన్నాన‌ని వివ‌ర‌ణ ఇస్తున్నారు.

చట్టం.. నిబంధనలు..న్యాయం వంటి వాటి సంగతి సరే కానీ అది ధర్మమా, న్యాయమా అన్నదే ఇప్పుడు సామాన్యులకు అంతుబట్టని విషయం. రాళ్లురప్పలు తప్ప ఏమీ లేని, కొండలు గుట్టలు  తప్ప  ఏమీ కనిపించని భూమిని కొంటే అక్కడ రాళ్లు కొట్టుకోవాల్సిందేనని భావించే తరుణంలో కొన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు వ్యవసాయంచేసే వారికిచ్చే రైతుబంధు సహాయాన్ని కూడా ఆ భూమి పేరిట పొందినట్లు ప్రచారంలో ఉంది. పొరుగునే తమకు దగ్గరి వారి రియల్‌ఎస్టేట్‌ సంస్థ పేరిట కూడా దాదాపు 125 ఎకరాలు కొనుగోళ్లు జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. చట్టం.. నిబంధనల మేరకు అనుగుణంగానే,సవ్యంగానే సోమేశ్‌కుమార్‌ వ్యవహరించి ఉండవచ్చు. అందుకు  అభినందించాల్సిందే. తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. కానీ ఆయన ఓ సామాన్య పౌరునిగా   ఉండి ఆ స్థలాన్ని  కొంటే తెలివికి, సాహసానికి ప్రశంసించాల్సిందే కానీ.. ముందస్తుగా  వివరాలు తెలిసే అధికారంలో ఉండి కొనడమే ఆక్షేపణీయం. ఏలాభాపేక్ష లేనిదే పంటలకు పనికిరాని బీడు భూముల‌ను 25 ఎకరాలు కొంటారా ?  అక్క‌డ  ప్యాలెస్‌లు కట్టుకోవాలనుకున్నారా ? అనేదాని చుట్టూ ఇప్పుడు రాజకీయాలు న‌డుస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ