వైసీపీ స్పీడు త‌గ్గిందా? అలా క‌నిపిస్తోందా?

AP Politics, YCP, CM Jagan, YCP MLAs, Abdul Nazeer, Governor of Andhra Pradesh, Biyyapu Madhusudhan Reddy, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Elections, Andhra Pradesh elections, TDP, Mango News Telugu, Mango News
AP Politics, YCP, CM Jagan, YCP MLAs

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ఎన్నిక‌ల మూడ్ వ‌చ్చేసింది. ఇన్‌చార్జిల మార్పు, అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌, కొత్త‌వారి కోసం వ‌డ‌బోత కార్య‌క్ర‌మాల్లో రాజ‌కీయ పార్టీల‌న్నీ బిజీబిజీగా ఉంటున్నాయి. అయితే.. అధికార పార్టీ వైసీపీలో వింత ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఒక‌రిద్ద‌రు మిన‌హా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేత‌ల హ‌డావిడి పెద్ద‌గా క‌నిపించ‌డంలేదు. ఈసారి అసెంబ్లీ స‌మావేశాల్లోనూ వింత వాతావ‌ర‌ణం క‌నిపించింది. గ‌తేడాదిలో జ‌రిగిన స‌మావేశాల‌కు ఈద‌ఫా జ‌రిగిన స‌మావేశాల‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేల వ్య‌వ‌హార‌శైలిలో ఎన్నో మార్పులు క‌నిపించాయి. గతేడాది మార్చిలో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో స్పీకర్‌పై ఈగ వాలినా ఊరుకోం అన్నట్టు వ్యవహరించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈసారి ఎందుకో మౌనం దాల్చిన‌ట్లు క‌నిపించారు. అప్పట్లో స్పీకర్‌ పోడియం ఎక్కిన టీడీపీ ఎమ్మెల్యేలపై భౌతిక దాడులకూ వెన‌కాడ‌ని ప‌రిస్థితులు క‌నిపించాయి.

ఈసారి నాలుగు రోజుల పాటు జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల‌ను ప‌రిశీలిస్తే గ‌తానికి భిన్నంగా వైసీపీ ఎమ్మెల్యేల వ్య‌వ‌హార‌శైలి క‌నిపించింది. ఎందుకో అంత‌కుముందున్న ఉత్సాహంగా వారిని లేద‌న‌ట్లుగా ఉంది. ఏపీ అసెంబ్లీ దగ్గర గందరగోళం చోటు చేసుకుంది. అసెంబ్లీలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిసుండగా, తెలుగుదేశం సభ్యులు సభ నుంచి  వాకౌట్‌ చేశారు.అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా  నినాదాలు చేశారు.గవర్నర్‌ వెళ్లేదారిలో బైఠాయించే ప్రయత్నం చేశారు… ఇంత జ‌రుగుతున్నా వైసీపీ ఎమ్మెల్యేలు అంత‌గా స్పందించ‌లేదు. రోజూ ఏదో సంద‌ర్భంలో బై బై జగన్‌ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనకు దిగుతున్నా.. పెద్ద‌గా ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుందా, రాదా అనే సందేహంలో చాలా మంది ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. అందువల్లే కొంద‌రు దూకుడుగా వ్యవహరించ‌డం త‌గ్గించార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. గతేడాది మార్చి 20న అసెంబ్లీ మొదటిసారి భౌతిక దాడులకు వేదికయ్యింది. అప్పట్లో జీవో నంబరు 1పై టీడీపీ అసెంబ్లీలో పెద్దఎత్తున ఆందోళన చేసింది. జీవో 1ను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియంపైకి వెళ్లి నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి.. స్పీకర్‌కు అడ్డుగా ప్లకార్డు పెట్టారు. దీంతో స్పీకర్‌, డోలా మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా అక్కడకు వెళ్లి….డోలాను లాగే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు వెళ్లి….డోలాపై దాడికి దిగారు. కడుపులో గుద్దడంతో డోలా కింద పడిపోయారు. ఈ ఘటన చూసి నిర్ఘాంతపోయిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం… సభను వాయిదా కూడా వేయకుండానే ఆయన చాంబర్‌లోకి వెళ్లిపోయారు. వాయిదా తర్వాత సభ మరింత రణరంగంగా మారింది.

ఇలాంటి ఘ‌ట‌న‌లు ఈసారి అసెంబ్లీ స‌మావేశాల్లో అంత‌గా క‌నిపించ‌ లేదు. టీడీపీ స‌భ్యులు ప్ర‌భుత్వంపై తీవ్ర‌మైన  స్థాయిలో ఆరోప‌ణ‌లు చేస్తున్నా.. మంత్రి అంబటి రాంబాబు, టీజేఆర్‌ సుధాకర్‌బాబు, బియ్యపు మధుసూదన్‌రెడ్డి మినహా ఎవరూ దాన్ని పెద్దగా అడ్డ‌గించేవారు కాదు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జ‌రిగిన చర్చ సంద‌ర్భంగా మాట్లాడుతున్న సుధాకర్‌బాబు విపక్ష సభ్యుల చర్యను ఖండించారు. గతంలో ఇలాంటి వ్యవహారంలోనే దాడికి దిగే స్థాయికి వెళ్లిన ఆయన ఈసారి నాలుగు మాటలతో సరిపెట్టారని వైసీపీ వ‌ర్గాల్లోనే ప్ర‌చారం జ‌రుగుతోంది.  అది కూడా ఆ సమయంలో ఆయన ప్రసంగిస్తున్నందున తప్పదు కాబట్టి మాట్లాడాలి అన్నట్టుగా ఖండించారు. అప్పట్లో ఇలాంటి నిరసనలు జరిగినప్పుడు ఖండించేందుకు మంత్రులు పోటీపడేవారు. ఈ క్ర‌మంలో వైసీపీ స్పీడు త‌గ్గిందా? లేక అన‌వ‌స‌ర రాద్దాంతాలు మాని ఎన్నిక‌ల్లో అవ‌స‌ర‌మైన అంశాల‌పైనే పార్టీ దృష్టి పెట్టిందా అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE