ఏపీ రాజకీయాలు.. ప్రధానంగా కడపలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత నుంచీ సీరియల్ థ్రిల్లగా నడుస్తున్న రాజకీయాలు.. త్వరలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో మరింత హీటెక్కనున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య ఘటన ఈసారి కడప జిల్లాలో ఎన్నికల ఎజెండాగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తన తండ్రి హత్యకు కారకులైన వారికి శిక్ష పడాలంటే ఈసారి ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేయవద్దని ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కుమార్తె డాక్టర్ సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సందర్భం వచ్చినప్పుడల్లా జగన్ కు వ్యతిరేకంగా ఆమె స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. డాక్టర్ సునీత ఆరోపణలు, ప్రకటనలు కడప జిల్లాలో సంచలనం కలిగించాయి. ఈనేపథ్యంలో వివేకా సతీమణి సౌభాగ్యమ్మను టీడీపీ నుంచి ఎంపీ బరిలో నిలబడాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఆ జిల్లా టీడీపీ నేతలు కొందరు అధిష్ఠానం ముందు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలపై టీడీపీ అధిష్ఠానం కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివేకా హత్య వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. సరిగ్గా ఐదేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల ముందు వివేకా పులివెందులలోని తన ఇంట్లోనే హత్యకు గురైన విషయం తెలిసిందే. తన తండ్రిని కిరాతకంగా హత్య చేసిన వారిని శిక్షించి, న్యాయం చేయాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీత అప్పటి నుంచి పోరాడుతున్నారు. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ వేసిన జగన్మోహన్‌రెడ్డి, తర్వాత దానిని ఉపసంహరించుకోవడం, కోర్టు ఆదేశంతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ వేగంగా అడుగులు ముందుకు వేయలేకపోవడం ప్రజల్లో చర్చనీయాంశాలయ్యాయి.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన తండ్రి వైఎస్ భాస్కర రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అవినాశ్ రెడ్డిని మాత్రం అరెస్టు చేయలేదు. కడప ఎంపీ సీటుకు పోటీ వస్తున్న వివేకాను అడ్డు తొలగించుకోవడానికే ఆయనను హత్య చేశారని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఆరోపించారు. ఈ కేసు ఎటూ తేలకుండా జీడిపాకంలా సాగుతుండటంతో వివేకా కుమార్తె సునీత ఇటీవల నోరు విప్పారు. తన తండ్రి హత్యకు కారకులైన వారికి శిక్ష పడాలంటే ఈసారి ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేయవద్దని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నుంచి మరోసారి అవినాశ్ రెడ్డే పోటీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నయి. దీంతో వివేకా సతీమణి సౌభాగ్యమ్మను అవినాశ్ రెడ్డిపై పోటీకి నిలిపితే మంచి ఫలితం ఉంటుందని ఆ జిల్లా టీడీపీ నేతలు ఇటీవల తమ అధినేత చంద్రబాబు వద్ద ప్రతిపాదించారు.
అదే జరిగితే ఎంపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా మారనున్నాయి. మాటలు.. తూటాల్లా పేలనున్నాయి. కత్తుల్లా గుచ్చుకోనున్నాయి. వివేకానందరెడ్డిని చంపిన వారికి ప్రజా కోర్టులో అయినా శిక్ష పడాలని డాక్టర్ సునీత ఇప్పటికే పిలుపునిచ్చారు. సౌభాగ్యమ్మ ఎన్నికల్లో నిలబడడం ఖాయమైతే ఆమెకు మద్దతుగా సునీత మరింత సీరియస్ గా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి, వివేకా మరణంతో దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యుల మధ్య పోటీపై చర్చనీయాంశంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE