
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. గెలుపుపై అంత కాన్ఫిడెంట్ గా జగన్ ఉండడం ఆశ్చర్యంగా మారింది. ఎన్నికల అనంతరం గెలుపుపై ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేయడం సాధారణమే. ఏపీలో కూడా అదే జరుగుతోంది. అటు వైసీపీ నేతలు.. ఇటు కూటమి నేతలు ఈ ఎన్నికల్లో గెలిచేది తామేనని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం కూటమికి ఆశ్చర్యకరమైన ఫలితాలు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పోలింగ్ పూర్తయిన రోజు సాయంత్రమే ప్రకటించారు. జగన్ మాత్రం అలా కాదు.. మూడు రోజుల పాటు ఎక్కడా మాట్లాడలేదు. కనీస ప్రకటన చేయలేదు. కానీ.. గురువారం ఐప్యాక్ బృందాన్ని కలిసిన సమయంలో ఒక్కసారిగా భారీ బాంబ్ పేల్చారు. అంధ్రప్రదేశ్‌లో మరోసారి అధికారం వస్తున్నామని చెప్పడం కాదు.. దేశం మొత్తం మనవైపే చూసేలా సంచలన ఫలితాలు వస్తాయని పేర్కొనడమే సంచలనంగా మారింది.
ఐదేళ్లపాటు ప్రజలకు మంచి పాలన అందించామని, ప్రజలు మనకు మంచి ఫలితాలు అందించబోతున్నారని వెల్లడించారు. జూన్ 4న వచ్చే ఫలితాలను చూసి.., దేశంలోని అన్ని రాష్ట్రాలూ మనల్నే చూస్తాయన్నారు. ఐ ప్యాక్ సేవలు మరువలేనివని తెలిపారు. విజయవాడలోని ఐ ప్యాక్ బృందంతో సమావేశమైన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి గతం కన్నా ఎక్కువ ఫలితాలు వస్తాయన్నారు. 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీల మార్క్ దాటబోతున్నామని చెప్పారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు జగన్ కౌంటర్ ఇచ్చారు. ఆయన మధ్యలో మాట మార్చాడాని, పీకే కూడా కలలో ఊహించని ఫలితాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. గెలుపుపై ఆ స్థాయిలో ప్రకటన జగన్ నుంచి ఎవరూ ఊహంచలేదు.
మొదటి నుంచీ వైసీపీ ప్రభుత్వంపై ఎంతో కొంత వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతూనే ఉంది. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా.. ఎన్టీఏ కూటమికి కాస్త అనుకూల వాతావరణం ఉందనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపించాయి. వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే అర్ధరాత్రి వరకు ఓటర్లు క్యూలో ఉండి కసితో ఓటేశారని కూటమి నేతలు చెబుతూ వస్తున్నారు. అలాగే.. వైసీపీ నేతలు కూడా గెలుపుపై ధీమాగానే ఉన్నారు. గతం కంటే సీట్లు తగ్గినా.., ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేయబోయేది తామేనని పేర్కొన్నారు. కానీ, జగన్ ప్రకటన అందుకు విరుద్ధంగా ఉంది. పెరగడమే కానీ తగ్గేది లేదని కుండబద్దలుకొట్టారు. గత ఎన్నికల్లో వచ్చిన 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీల మార్క్ ను కూడా దాటబోతున్నామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు.
ఆ తర్వాత మంత్రి బొత్స సత్యానారాయణ అయితే.. ఏకంగా జగన్ ముఖ్యమంత్రిగా చేయబోయే ప్రమాణస్వీకార తేదీని కూడా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 9న జగన్ సీఎంగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. వేదిక ఎక్కడో రెండు రోజుల్లో చెబుతానని అన్నారు. కేంద్రంలో తమ మీద ఆధారపడే ప్రభుత్వం రావాలని కోరుకుంటానని… ఇది తన స్వార్థమని తెలిపారు. అటు జగన్ ప్రకటన, ఇటు మంత్రి బొత్స ప్రమాణస్వీకార తేదీని ప్రకటించడంతో అధికారంలోకి వస్తున్నట్లు వైసీపీ బలంగా నమ్ముతుందా, లేక కొద్ది రోజులు మైండ్ గేమ్ తో విపక్ష పార్టీకి మనశ్శాంతి లేకుండా చేద్దామని నిర్ణయించిందా అనే చర్చ జరుగుతోంది. అసలు విషయం తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY