
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అందరి దృష్టి ఇప్పుడు నల్లారి బ్రదర్స్.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పైనే ఉంది. రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగితే, ఆయన సోదరుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నల్లారి కిషోర్.. పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో అందరి చూపు ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాలపైన పడింది.
దీనికి తోడు పీలేరు, రాజంపేట పార్లమెంటులో పోటీ చేస్తున్న ఈ నల్లారి సోదరుల ఓటమే లక్ష్యంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఫైట్ చేయడంతో ఈ ఆసక్తి ఇంకా పెరిగిపోయింది. రెండు చోట్లా కూడా మైనారిటీ ఓట్లే కీలకం కావడంతో నల్లారి సోదరుల విజయం అంత ఈజీ కాదని వైసీపీ లెక్కలేస్తుండగా.. పెద్దిరెడ్డి ఫ్యామిలీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నల్లారి అన్నదమ్ముల మధ్య ఐక్యతతో తమ విజయం ఖాయమని కూటమి ధీమాతో ఉంది.
ఎప్పటి నుంచో పెద్దిరెడ్డి ,నల్లారి కుటుంబాల మధ్య రాజకీయ వైరం కొనసాగుతుండటంతో ఇక్కడ పోటీ కూటమి, వైసీపీ మధ్య కంటే పాత కాపుల మధ్యనే పోటీ అన్నట్లుగా సాగింది. అంటే నల్లారి సోదరుల పోరు పెద్దిరెడ్డి కుటుంబంపైనే అన్నట్లు ఆసక్తికరంగా సాగింది. పీలేరులో నల్లారి కిషోర్ పై చింతల రామచంద్రారెడ్డితో పోటీ చేయించిన పెద్దిరెడ్డి, రాజంపేట పార్లమెంటు స్థానంలో బీజేపీ నుంచి పోటీకి దిగిన నల్లారి కిరణ్ పై పోటీకి తన కొడుకు ఎంపీ మిథున్ రెడ్డిని దింపారు.
సుమారు 5 దశాబ్దాలుగా నల్లారి, చింతల కుటుంబాల మధ్య సాగుతున్న రాజకీయ వైరం కాస్తా. కొన్నేళ్లుగా నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ శత్రుత్వంగా మారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ఆఖరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజన తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ ఈ ఎన్నికలలో రాజంపేట పార్లమెంటుకు బీజేపీ తరుపున బరిలో నిలవగా.. సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హ్యాట్రిక్ కోసం పోటీ పడటంతో వీరిద్దరి మధ్య బిగ్ ఫైట్ నడిచింది.
రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్‌లో కిరణ్ కుమార్ రెడ్డి, పీలేరు నియోజకవర్గం నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బరిలో ఉండటంతో రాజకీయాలు వేడెక్కాయి. అలాగే మ2014, 2019 ఎన్నికల్లో కిషోర్ కుమార్ రెడ్డి ఓడిపోయినా కూడా, 2024 తిరిగి బరిలో నిలిచి ఢీ అంటే ఢీ అనే రీతిలో టఫ్ ఫైట్ ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా పెద్దిరెడ్డి టార్గెట్ గా గట్టి పోటీనే ఇచ్చారు. ఎన్నికల ప్రచారమంతా పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాలపైనా, వ్యక్తిగత దూషణలు, సవాళ్లు, చాలెంజ్‌లు, సత్య ప్రమాణాలుతో సాగాయి. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంటి అగ్ర నేతల ప్రచారంతో మరింత హోరెత్తించాయి.
రాజంపేట లోక్‌సభ పరిధిలో 16లక్షల33వేల 759 మంది ఓటర్లు ఉండగా 13లక్షల17వేల 747 మంది ఓటర్లు ఓటు వేశారు. రాజంపేట పార్లమెంటు పరిధిలో సుమారు 2.60 లక్షలకు పైనే మైనారిటీ ఓటర్లు ఉండగా, ఈ ఓటర్లను వైసీపీ, కూటమి తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాయి. మరోవైపు పీలేరు అసెంబ్లీ లో 2లక్షల34వేల608 ఓటర్లు ఉండగా 1లక్షా90వేల234 మంది ఓటు వేశారు. మొత్తంగా 81.09 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే నల్లారి బ్రదర్స్ వర్సస్ పెద్దిరెడ్డిగా సాగిన ఈ ఎన్నికల యుద్ధంలో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY