ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చేది తామేనంటూ వైసీపీ జోరుగా ప్రచారం నిర్వహించింది. వై నాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. సిద్ధం పేరుతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టి, బహిరంగ సభలు నిర్వహించారు. కానీ వైసీపీ ప్రయత్నాలన్నీ అట్టర్ ప్లాఫ్ అయ్యాయి. 175 కాదు కదా వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. అలాగే నాలుగు లోక్ సభ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. అటు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా.. 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. త్వరలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మరి ఈ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా?.. లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఈనెల 17 లేదా 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించేందుకు కసరత్తు జరగుతున్నట్లు తెలుస్తోంది. అయితే 17వ తేదీన బక్రీద్ పండుగ ఉన్నందున.. 19వ తేదీ బుధవారం నుంచి సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం స్పీకర్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. అలాగే ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులంతా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. అలాగే ఈ నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ముస్తున్నందున.. పూర్తి స్థాయి బడ్జెట్‌ని అసెంబ్లీలో ఆమోదించాల్సి ఉంది. అందుకోసమే వీలైనంత త్వరగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
అయితే వైసీపీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అసెంబ్లీ మొత్తం కూటమి అభ్యుర్థులే ఉన్నారు. కేవలం 11 మంది మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందువల్ల జగన్ ఈసారి అసెంబ్లీకి వెళ్లే అవకాశం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంత సమయం విరామం తీసుకున్న తర్వాత జగన్ ప్రజాక్షేత్రంలోకి వెళ్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అలాగే అసెంబ్లీ 11 మంది ఎమ్మెల్యేలతో అధికార పక్షాన్ని ఎదుర్కోవడం సాధ్యం కాదని.. అందువల్ల శాసనమండలిలో తమ బలం ఎక్కువగా ఉన్నందున అక్కడే అధికార పక్షంపై పోరాడాలని జగన్ భావిస్తున్నారు.
ఈ మేరకు ఇటీల జగన్ వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. శాసనమండలిలో వైసీపీకి 30కి పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇకపై వారే ప్రతిపక్ష పాత్ర పోషించాలని జగన్ సూచించారు. శాసనమండలిలో అధికార పక్షం నోరు ఎత్తనీయకుండా గట్టిగా పోరాడాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఈ పరిణామాలను చూస్తుంటే జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE