ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన మద్యం విధానానికి..కూటమి ప్రభుత్వం త్వరలోనే మంగళం పాడటానికి సిద్దమవుతోంది. దీని స్ధానంలో కొత్తగా మరో ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తేవడానికి చర్యలు ప్రారంభించింది. దీని కోసం ఇతర రాష్టాల్లో అమలవుతున్న మద్యం విధానాన్ని అధ్యయనం చేయడానికి నాలుగు బృందాల్ని ఏర్పాటు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. నాలుగు బృందాలలో.. ఒక్కో టీమ్ లో ముగ్గురు అధికారుల చొప్పున ఉన్నారు. పది రోజుల్లో వీరంతా ఆయా రాష్ట్రాల్ని సందర్శించి ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. దీని ఆధారంగానే కొత్త ఎక్సైజ్ పాలసీ రూపుదిద్దుకోబోతుంది.
ఏపీలో ప్రస్తుతం వైఎస్సార్సీపీ మద్యం పాలసీనే అమలు చేస్తున్నారు. దాని ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు ఉన్నాయి. గతంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకముందు ప్రైవేటు కాంట్రాక్టర్లు వేలం ద్వారా మద్యం షాపుల్ని చేజిక్కించుకునేవారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం ఈ విధానాన్ని రద్దు చేసి తామే మద్యం వ్యాపారం చేస్తామంటూ రకరకాల ప్రయోగాలు చేసింది. దీనికోసం ప్రత్యేకంగా భారీ ఎత్తున సిబ్బందిని కూడా నియమించుకుంది. ప్రారంభంలో గవర్నమెంట్ టీచర్ల సేవలను కూడా వాడుకుంది. అయితే ఇప్పుడు సిబ్బందిని తొలగించి ప్రైవేటు వ్యక్తులకే ప్రభుత్వం తిరిగి కాంట్రాక్టులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
గతంలో దశలవారీ మద్య నిషేదాన్ని అమలు చేస్తామంటూ హామీ ఇచ్చిన వైసీపీ సర్కార్.. అధికారం చేపట్టాక మాట మార్చేసింది. మెల్లమెల్లగా తగ్గించినట్లు తగ్గించి.. ఆ తర్వాత తిరిగి వాటిని పెంచేసింది. నాసిరకం బ్రాండ్లను అంటగట్టి.. అసలు బ్రాండ్లను ఏపీలోకి రానివ్వకుండా అడ్డుకుంది. మద్యం పంపిణీ, సరఫరాపై తీవ్ర ఆంక్షలను విధించింది. దీని వల్ల ప్రభుత్వ పెద్దలకు మాత్రమే లబ్ది చేకూరింది..మందుబాబులు మరింత అనారోగ్యం పాలయ్యారు.
దీనిపైన దృష్టి పెట్టిన కూటమి సర్కార్.. ఇప్పుడు తిరిగి వేలం పాట నిర్వహించి మద్యం షాపుల్ని మళ్లీ ప్రైవేటుకు కట్టబెడితే మంచిదన్న ఆలోచనకు వచ్చింది. దీనికోసమే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందం అందించే నివేదిక ఆధారంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమలు చేయనుంది.