ఆహ్లాదరకరమైన ప్రదేశాలకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే అందరికంటే భారతీయులకు కాస్త మక్కువ ఎక్కువే. పక్కనే ఉన్న శ్రీలంక పర్యాటక అందాలను చూసి వద్దామనుకున్న వాళ్లు వీసా కండిషన్ తో వెనుకడుగు వేసేవారు.ఇలాంటివారికి ఇప్పుడు శ్రీలంక ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఒకవిధంగా తమ దేశానికి అనుకూలంగా తీసుకున్న ఈ నిర్ణయమే అయినా.. ట్రావెలింగ్ ఇష్టపడుతున్న ఇండియన్స్ కు మాత్రం ఇది కచ్చితంగా గుడ్ న్యూసే అవుతుంది.
ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్న శ్రీలంక ప్రభుత్వం..తాజాగా ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తమ దేశ పర్యాటక ఆదాయాన్ని పెంచడానికి అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తూ వస్తున్న శ్రీలంక..దీనిలో భాగంగా, భారతీయులకు ఓ తీపి కబురు చెప్పింది.ఇది గతంలో ఉన్నా కూడా ఆ గడువు ముగిసిపోవడంతో మరోసారి ఆ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
ఆరు నెలల పాటు భారతీయులకు.. శ్రీలంకలో వీసా రహిత ప్రవేశాన్ని కల్పించింది. భారతదేశంతో పాటు 35 దేశాల వారికి ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దీనిపై శ్రీలంక దేశ మంత్రిమండలి తాజాగా నిర్ణయం తీసుకుంది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తున్నట్లు తెలిపింది.
ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడమే టార్గెట్‌గా ..ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు శ్రీలంక పర్యాటక మంత్రిత్వ శాఖ సలహాదారు హరిన్ ఫెర్నాండో తెలిపారు. భారత్‌తో పాటు చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, జపాన్, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలు కూడా ఈ ఫ్రీ వీసా జాబితాలో ఉన్నాయి. అయితే శ్రీలంకలో ఆన్ అరైవల్ వీసాల కోసం పెరిగిన ఛార్జీలను ఒక విదేశీ కంపెనీ నిర్వహిస్తుందనే వివాదం సాగుతుండటంతో.. అక్కడి సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఫ్రీ వీసాలు అందించే పైలట్ ప్రాజెక్టును 2023 అక్టోబరులో శ్రీలంక తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్టు గడువు మార్చి 2024లో ముగిసింది. ఇప్పుడు మరిన్ని దేశాలను చేర్చి ఈ పైలట్ ప్రాజెక్టులో చేర్చింది. ఇక పైలట్ ప్రాజెక్టులోని ట్రావెలర్స్.. శ్రీలంకకు రాగానే డ్యూయల్ ఎంట్రీ స్టేటస్ ఇస్తారు. ఫ్రీ వీసా ద్వారా శ్రీలంకలో 30 రోజుల వరకు బస చేసే అవకాశం ఉంటుందని ..దీనిని అంతా వినియోగించుకోవాలని శ్రీలంక ప్రభుత్వం కోరుతోంది.