దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ఒకరు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆయన పెళ్లి గురించి ఎప్పుడూ ఓ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీకి ఆయన పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో విద్యార్థినులతో భేటీ అయిన రాహుల్ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న క్రమంలో రాహుల్ గాంధీకి ఊహించని ప్రశ్న ఎదురైంది. పెళ్లి గురించి మీ ఇంట్లో ఒత్తిడి చేయడం లేదా? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. దీనికి ఆయన నవ్వుతూ సదరు యువతులనే మీ పెళ్లి ఎప్పుడు అని అడిగారు. పెళ్లి అనేది జీవితంలో తప్పని ఘట్టం అని.. కానీ ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏం లేవు అని రాహుల్ బదులిచ్చారు.
ప్రస్తుతానికి వివాహ ప్రణాళికలు ఏమీలేవని… అలా అని వాటిని తోసిపుచ్చలేమని రాహుల్ గాంధీ అన్నారు. ఇక పెళ్లి ఇంట్లో ఒత్తిడి గురించి రాహుల్ గాంధీ నవ్వుతూ సమాధానం చెప్పారు. ఇరవై ముప్పై ఏళ్ల నుంచి ఈ ఒత్తిడిని అధిగమిస్తూ వస్తున్నానన్నారు. ఇప్పుడు పెళ్లి ప్రణాళికలు లేనప్పటికీ, ఈ విషయాన్ని కొట్టి పారేయలేమన్నారు. ఈ సమయంలో విద్యార్థులు జోక్యం చేసుకొని, పెళ్లి చేసుకుంటే తమను పిలవాలని కోరారు. తప్పకుండా అందర్నీ ఆహ్వానిస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ అగ్రనేత తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ ఉండటం… దీనికి ఆయన సమాధానం దాటవేయడం షరామామూలే. గత ఎన్నికల్లో కూడా రాయ్‌బరేలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న రాహుల్ గాంధీ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ఓ చిన్నారి మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు అని అడిగితే ఆయన నవ్వుతూ బదులిచ్చారు. బహుశా ఇదే సరైన సమయం ఏమో.. త్వరలోనే వివాహం చేసుకుంటాను అని రాహుల్ సమాధానమిచ్చారు. అలాగే, ఓ ఇటాలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ వివాహం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలియదన్నపేర్కొన్న ఆయన.. తనకు పిల్లలు మాత్రం కావాలని ఉందని చెప్పారు..ఇప్పటి వరకూ పెళ్లి ఎందుకు చేసుకోలేదన్న విషయం తనకే విచిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. తాను చాలా పనులు చేయాల్సి ఉన్నందున్న పిల్లలు కావాలని ఉందని రాహుల్ పేర్కొన్నారు.