మరి కొద్ది రోజుల్లో ఆగస్ట్ నెల కంప్లీట్ అయి సెప్టెంబర్ మాసంలోకి అడుగుపెడతాం. అయితే ఈ కొత్త నెల నుంచి కొన్ని ప్రత్యేక మార్పులు కనిపించనున్నాయి. దీనివల్ల సాధారణ ప్రజల జేబులపై నేరుగా ప్రభావం పడుతుంది. సెప్టెంబర్ నెల నుంచి రానున్న కొత్త మార్పులలో ..ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర నుంచి క్రెడిట్ కార్డ్‌ల నియమాల వరకు అన్నీ ఉండనున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌కు సంబంధించి కూడా ప్రత్యేక ప్రకటనలు ఉండవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వాలు, కంపెనీలు తీసుకొనే నిర్ణయాలు, ఆయా పాలసీల్లో మార్పులు ప్రజల జీవితంపై పెద్దగానే ప్రభావం చూపనున్నాయి.
కీలక మార్పులను ప్రజలు ముందుగానే తెలుసుకోవడం ద్వారా కొన్ని ప్రయోజనాలు కోల్పోకుండా జాగ్రత్త పడవచ్చు. ప్రతి నెల మొదటి తేదీన భారత ప్రభుత్వం ఎల్‌పీజీ ధరను సవరిస్తుందన్న విషయం తెలిసిందే. అలాగే సెప్టెంబర్ మాసంలో కూడా వాణిజ్య గ్యాస్ సిలిండర్లతో పాటు.. గృహోపయోగం కోసం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దీనిలో భాగంగానే ఈసారి కూడా ఎల్‌పీజీ సిలిండర్ ధరలో కొద్దిగా మార్పు వస్తుందని భావిస్తున్నారు.
గత నెలలో వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.8.50 పెరిగింది అయితే జులైలో మాత్రం దీని ధర రూ.30 తగ్గింది. ఎల్‌పీజీ సిలిండర్ల ధరలతో పాటు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ , సిఎన్‌జి-పిఎన్‌జి ధరలను కూడా చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తాయి. దీని వల్లే మొదటి తేదీన వాటి ధరల్లో కూడా మార్పులు చూడవచ్చని భావిస్తున్నారు.
మరోవైపు మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న నకిలీ కాల్స్, నకిలీ సందేశాలను అరికట్టడానికి.. టెలికాం కంపెనీలను ఇప్పటికే ట్రాయ్ హెచ్చరించింది. దీని కోసం ట్రాయ్ కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి టెలికాం కంపెనీలన్నీ కూడా ఇకపై 140 మొబైల్ నంబర్‌లతో ప్రారంభించి బ్లాక్‌చెయిన్ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌కు టెలిమార్కెటింగ్ కాల్స్, వాణిజ్య మెసేజులను పంపాలని ట్రాయ్ కోరింది.
సెప్టెంబర్ 1 నుంచి, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ యుటిలిటీ బిల్ చెల్లింపు లావాదేవీలపై రివార్డ్ పాయింట్‌ల పరిమితిని నిర్ణయించబోతోంది. దీని కింద కస్టమర్‌లు ఈ లావాదేవీలపై నెలకు 2వేల పాయింట్‌లను మాత్రమే పొందగలరు.థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేయడంపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇకపై ఎలాంటి రివార్డ్‌లను అందించదు.