ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఫిబ్రవరి నెల చివర్లో భారత పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ అధికారికంగా వెల్లండించింది. సత్య నాదెళ్ల భారత్ పర్యటన ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ మధ్య ఉండే అవకాశముందని సమాచారం. అయితే పర్యటనకు సంబంధించిన ప్రత్యేక తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా ఫిబ్రవరి 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సత్య నాదెళ్ల కూడా భారత్ కు రానుండడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత్ పర్యటన సందర్భంగా మైక్రోసాఫ్ట్ వినియోగదారులు, పారిశ్రామికవేత్తలు, స్టూడెంట్స్ తో సత్య నాదెళ్ల సమావేశం కానున్నారని, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అలాగే ముంబయి, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాధికారులతో సత్య నాదెళ్ల సమావేశమయ్యే అవకాశమునట్టు సమాచారం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై సత్య నాదెళ్ల ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టంపై భారత్ లో జరుగుతున్న సంఘటనలు బాధాకరమని పేర్కొన్నారు. అలాగే బంగ్లాదేశ్ దేశానికి చెందిన ఒక వ్యక్తి భారత్‌లో ఉన్నత స్థాయిలో ఉంటే చూడాలని ఉందని సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు.
Subscribe to our Youtube Channel Mango News for the latest News.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.