నా పేరు మోనార్క్ నేను నేను ఎవరి మాటా వినను.. ఇది తెలుగు సినిమాలోని ఓ పాపులర్ డైలాగ్. ఈ డైలాగ్ అచ్చంగా హైడ్రాకు సరిపోతుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ – హైడ్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే దూకుడు చూపిస్తోంది. హైదరాబాద్ లో నాలాలు, చెరువులను ఆక్రమించి నిర్మాణాలను చేసిన వారిని వదిలేది లేదని సీఎం రేవంత్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేస్తామని.. తన కుటుంబ సభ్యులు, బంధువుల నిర్మాణాలు ఉన్నా వదలమని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. అన్నట్టుగానే హైడ్రా దూకుడు పెంచింది. సిఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు.
హైడ్రా టీం యాక్షన్ లోకి దిగినప్పటి నుంచి దూకుడు కొనసాగిస్తోంది. చెరువులు, నాళాల ఆక్రమణలకు పాల్పడి, అనుమతులు లేకుండా భవనాలు నిర్మించినవారి జాబితాలను హైడ్రా సేకరించింది. ఆ మధ్య నాగార్జున ఎన్ కన్వెషన్ సెంటర్ ని నెలమట్టం చేయడంతో అందరి దృష్టిలో పడింది హైడ్రా. కాగా తాజాగా మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో అద్దె ఇంట్లో ఉంటున్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి కూడా అధికారులు నోటిసులు అంటించారు. ఆ ఇల్లు FTL పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
హైడ్రా నోటీసులు జారీ చేసిన వారిలో పలువురు ఐఏఎస్‌లు, ఐఆర్‌ఎస్ అధికారులకు చెందిన నివాసాలు ఉన్నట్టు తెలుస్తోంది. హైటెక్‌సిటీలోని రాయదుర్గం, మాదాపూర్ పరిధిలో ఉండే దుర్గం చెరువు చుట్టూ విలాసవంతమైన భవనాలు నిర్మించినవారు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో మొత్తం 204 ఇండ్లకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసారు. వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. 30 రోజుల్లోగా ఆక్రమణలు కూల్చేయాలని సూచించారు. వీరి నుంచి వచ్చే సమాధానం ఆధారంగా హైడ్రా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు సహా అందిరి ఇంటికి కూడా నోటీసులు అంటించడంతో ఏం జరుగుతుందోనని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కాగా కేటీఆర్ కు చెందినది గా ప్రచారంలో ఉన్న జన్వాడ ఫాం హౌస్ లోనూ తాజాగా ఇరిగేషన్ అధికారులు కొలతలు చూసారు. ఆక్రమణల పైన నివేదిక సిద్దం చేస్తున్నారు.