గణపతి నవరాత్రి ఉత్సవాలు అనగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు టక్కున గుర్తుకువచ్చేది హైదరాబాద్. ఖైరతాబాద్ వినాయకుడి నుంచి బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం వరకూ ప్రతీ అంశాన్ని వేడుకగా చూస్తారు. ఇక నిమజ్జనోత్సవం రోజు అయితే వీలయితే ట్యాంక్ బండ్ పరిసరాలకు లేదంటే టీవీలలో వచ్చే రకరకాల గణపతులను చూస్తే మైమరిచిపోతారు.
ప్రస్తుతం వినాయక చవితి దగ్గర పడటంతో.. ఎక్కడ చూసినా గణనాధుని విగ్రహాలే దర్శనమిస్తున్నాయి. రోడ్డు పక్కన అమ్మకానికి రెడీగా ఉన్న గణేశ్ విగ్రహాలతో పాటు..ఇప్పటికే కొన్ని మండపాల దగ్గరకు చేరుకుంటున్నాయి. మరికొన్నిటికి తుదిమెరుగులు దిద్దుతూ తయారీదారులు బిజీగా ఉన్నారు. దీంతో ఎక్కడ చూసినా గణపతుల సందడే కనిపిస్తుంది.
ఈసారి నగరంలో కొత్తవరవడి కొనసాగుతుంది గతం కంటే భిన్నంగా ఎక్కువమంది మట్టి గణపతులు కొనడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పర్యావరణం మీద మక్కువతోనే ఇలా చాలామంది మట్టి గణేశ్ లను కొంటున్నట్లు తయారీదారులు చెబుతున్నారు. సిటీలో చాలా చోట్ల కోల్‌కతా నుంచి వచ్చిన కళాకారులు పర్యావరణ గణపతిలను తయారు చేస్తున్నారు. వీరు తయారు చేసే విభిన్నమైన పర్యావరణ గణపతుల విగ్రహాల కోసం ఉమ్మడి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనాలు వస్తుంటారు.
గతంలో గణపతి నవరాత్రుల చివరి రోజున గణనాధుల వేడుకను నిర్వహించిన నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ కు తరలిస్తారు. అయితే ఈసారి చాలాచోట్ల గణేష్ విగ్రహాలను మండపాలకు తీసుకువచ్చినప్పుడు కూడా బాజా బాజంత్రీలు, ప్రత్యేక లైటింగ్స్ డెకరేషన్ వంటి ప్రత్యేక ఏర్పాట్లతో మండపాలకు తరలిస్తున్నారు గణపతి మండపాల నిర్వాహకులు. అయితే నిమజ్జనానికి ముందుగానే భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది.