దేశంలో మహిళలపై రోజుకు రోజుకు హత్యాచారాలు పెరుగుతున్నాయి. ఓ వైపు కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనాగుతుండగానే బిహార్‌లోని ఓ ఆస్పత్రిలో నర్సుపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది. అయితే బాధితురాలు చాకచాక్యంగా వ్యవహరించి ఘటన నుంచి తప్పించుకుంది. అక్కడే తాను పనిచేస్తున్న క్లినిక్‌లో ఉన్న బ్లేడ్‌తో డాక్టర్ జననాంగాలను కోసేసింది. ఘటనాస్థలి నుంచి బయటకొచ్చి పోలీసులకు సమాచారం అందించింది.
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సమస్తిపుర్ జిల్లాలోని ముశ్రీఘరారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్‌బీఎస్ హెల్త్‌కేర్ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. ఆ హెల్త్ కేర్ సెంటర్‌లో పనిచేస్తున్న బాధితురాలు, బుధవారం రాత్రి విధుల్లో నిమగ్నమై ఉంది. ఆ సమయంలో డాక్టర్, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ అయిన సంజయ్ కుమార్ మరో ఇద్దరు సహాయకులతో కలిసి ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. అయితే వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ నర్సు పదునైన బ్లేడ్‌తో డాక్టర్ జననాంగాలను కోసేసింది.
అనంతరం అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చి పోలీసులకు 112కు కాల్ చేసి ఫోన్‌లో సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఘటన జరిగినప్పుడు ఇద్దరు నిందితులు మద్యంమత్తులో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. అత్యాచారానికి ముందు సిసిటివి కెమెరాలు ఆఫ్ చేయడంతో పాటు ప్రధాని ద్వారానికి తాళం వేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆస్పత్రిలో మద్యం బాటిళ్లతో పాటు బ్లేడును, రక్తపు మరకలు ఉన్నదుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సు దైర్యంగా వ్యవహరించి ఈ దాడి నుంచి తప్పించుకుందని డిఎస్‌పి సంజయ్ పాండే కొనియాడారు.