హైడ్రా: ఇళ్లు కూల్చివేస్తారన్న భయంతో మహిళ ఆత్మహత్య.!

హైద‌రాబాద్ లో చెరువుల పరిధిలో అక్రమకట్టడాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే హైడ్రా కూల్చివేతల భయంతో ఓ మహిళా ఆత్మహత్య చేసుకుందన్న వార్త హైలెట్ అవుతోంది. కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని యాద‌వ బ‌స్తీకి చెందిన గుర్రంప‌ల్లి బుచ్చ‌మ్మ అనే మ‌హిళ హైడ్రా భ‌యంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. శివ‌య్య‌, బుచ్చ‌మ్మ దంప‌తులు త‌మ ముగ్గురు కూతుళ్ల‌కు పెళ్లిళ్లు చేసి, క‌ట్నంగా త‌లో ఇంటిని కానుకగా ఇచ్చారు.   అయితే, చెరువుల ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మించిన ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేస్తోందన్న ఈ విష‌యం తెలిసి త‌మ కూతుళ్లకు ఇచ్చిన ఇళ్లు కూల్చివేస్తార‌నే మ‌న‌స్తాపంతో త‌ల్లి బుచ్చ‌మ్మ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే.. ఈ ఘటనకు, హైడ్రాకు సంబంధం లేదని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. తాము ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. ‘మేము ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. బుచ్చమ్మ ఆత్మహత్య గురించి కూకట్‌పల్లి పోలీసులతో మాట్లాడాను. శివయ్య దంపతుల కూతుర్లుకు రాసిచ్చిన ఇళ్లు.. కూకట్‌పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నాయి. కానీ.. ఎఫ్‌టీఎల్‌ పరిధికి దూరంగా ఉన్నాయి. కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారనే భయంతో వారి కుమార్తెలు బుచ్చమ్మను ప్రశ్నించారు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరించారు.

మూసీ న‌దిలో శ‌నివారం భారీగా ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేయ‌బోతున్న‌ట్లు ఓ అసత్య  ప్ర‌చారం జరుగుతోంది. కొన్ని సోష‌ల్ మీడియా ఛాన‌ళ్లు ఒక ఎజెండాతో హైడ్రాపై న‌కిలీ వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నాయ‌ని రంగ‌నాథ్ మండిప‌డ్డారు. కూల్చివేత‌ల గురించి ప్ర‌జ‌లు అనవ‌స‌ర భ‌యాలు పెట్టుకోవ‌ద్ద‌న్నారు. కూల్చివేత‌ల వ‌ల్ల పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు ఇబ్బందులు ప‌డ‌కుండా హైడ్రాకు ప్ర‌భుత్వం క‌చ్చిత‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింద‌ని వివరించారు.