ఆఫ్ఘనిస్థాన్ సెన్సెషనల్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓ ఇంటివాడయ్యాడు. అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో రషీద్ పెళ్లి పెళ్లి ఘనంగా జరిగింది. దీంతో ప్రస్తుతం అతని పెళ్లి వేడుక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రషీద్ పెళ్లి జరిగిన కాబూల్‌లోని హోటల్ బయట గట్టి బందోబస్తు కనిపించింది. దాని తాలూకు వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, రషీద్ ఖాన్‌తో పాటు అతని ముగ్గురు సోదరులు ఒకే రోజు వివాహం చేసుకున్నారు. ప్రపంచంలోనే నం.01 టీ20 స్పిన్నర్‌గా ఉన్న ఈ ఆఫ్ఘన్ స్టార్ పెళ్లి పష్తూన్ ఆచారాల ప్రకారం జరిగింది.
ఆఫ్ఘనిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టు నుండి పలువురు క్రికెటర్లు అతని వివాహానికి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. ఖరీదైన బహుమతులు అందజేశారు. కొత్త ప్రయాణం అద్భుతంగా సాగాలని అభిలషించారు. ఇక పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన రషీద్‌కు పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జీవితంలో మరో అధ్యయనం ప్రారంభించబోతున్నందుకు శుభాకాంక్షలని జాతీయ టీం వెటరన్ క్రీడాకారుడు ముహమ్మద్ నబీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. అతడి జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్యర్యంతో నిండిపోవాలని ఆకాక్షించాడు.
రషీద్ ఈ తరం అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు అనడంతో ఎలాంటి సందేహం లేదు. బౌలింగ్‌తోనే కాకుండా అప్పుడప్పుడు బ్యాటింగ్‌లో కూడా రప్ఫాడిస్తుంటాడు. అతడు ఆల్ రౌండర్‌గా కూడా పేరు సంపాదించాడు. దీంతో, ప్రపంచంలోని టాప్ క్రికెటర్లలో ఒకడిగా గుప్తింపు సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో ఈ ఆటగాడు సమ్‌థింగ్ స్పెషల్ అనే చెప్పాలి. దీంతో పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా 50 మరియు 100 వికెట్లు తీసిన బౌలర్‌తో సహా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో కూడా రషీద్ నంబర్‌వన్ బౌలర్‌గా నిలిచాడు.