దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు దేశం మొత్తం బాధతో వీడ్కోలు చెప్పింది. ఆయన తన విజన్ తో దేశ వ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితం చేశారు. ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ప్రజలు ఇప్పటికీ వివిధ రకాలుగా నివాళులు అర్పిస్తున్నారంటే ఈ విషయం అర్థం చేసుకోవచ్చు. రతన్ టాటా చిరస్మరణీయంగా నిలిచిపోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్య, నైపుణ్యాభివృద్ధికి రతన్ టాటా చేసిన కృషిని గుర్తించే లక్ష్యంతో మహారాష్ట్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం పేరును “రతన్ టాటా మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ”గా మార్చనున్నట్లు సోమవారం ప్రకటించింది.
ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీయల్ అవార్డులను రతన్ టాటా పేరుతో ఇవ్వాలని నిర్ణయించడంతో రతన్ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ఇవ్వాలని కోరిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల సూరత్‌కు చెందిన ఓ నగల వ్యాపారి సుమారు 11 వేల వజ్రాలతో రతన్ టాటా చిత్రపటాన్ని తయారు చేసి నివాళులర్పించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్ట్ కూడా చాలా వేగంగా వైరల్ అయింది. ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఇన్ స్టంట్ బాలీవుడ్ షేర్ చేసిన ఈ అద్భుతమైన మాస్టర్ పీస్ వీడియోను ఇప్పటివరకు ఐదున్నర లక్షల మందికి పైగా లైక్ చేశారు. అంతే కాదు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రతన్ టాటా పేరు మోగిపోతోంది. ఆయన లైఫ్ స్టైల్, వృత్తి పట్ల ఆయనకు ఉన్న అంకిత భావం ఇలా అన్ని రకాలుగా రతన్ టాటా పై పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.
ఇక రతన్ టాటా ఇక రతన్ టాటా వారసుడిగా నోయల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా రతన్ టాటా స్థానంలో నోయల్ టాటాను ఎన్నుకున్నట్లు ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. రతన్ టాటాకు నోయల్ టాటా సవతి సోదరుడు. ఇప్పుటికే ఆయన టాటా గ్రూప్‌లో ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారు. మొదట పలువురి పేర్లు వినిపించినా.. చివరకు టాటా ట్రస్ట్ సభ్యులు నోయల్ టాటా వైపే మొగ్గు చూపారు.