జనాభా విషయంలో భారత దేశం చైనాను ఎప్పుడో బీట్ చేసేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా జనాభా ఉన్న దేశంగా..ఇండియా అవతరించింది. ఇలా జనాభా పెరుగుతూ పోతే ఆహార సంక్షోభం, వనరుల సంక్షోభం ఎదురవుతుందన్న విషయాన్ని అర్ధం చేసుకున్న ప్రభుత్వాలు జనాభాను తగ్గించడానికి కొన్ని సంవత్సరాలుగా కుటుంబ నియంత్రణను అమలు చేస్తూనే ఉన్నాయి.
అయితే తాజాగా తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేవని, అందుకే గతంలో పెద్దలు చెప్పిన 16 రకాల సంపదలకు బదులు 16 మంది పిల్లల్ని కావాల్సిన అవసరం ఉందని స్టాలిన్ చెప్పారు. తమిళనాడులో హిందూ మత, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 21న సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరయ్యారు.
ఈ సామూహిక వివాహాల కార్యక్రమంలో 31 జంటలు వివాహ బంధం ద్వారా ఒకటయ్యారు. వివాహ క్రతువు పూర్తయిన తర్వాత నూతన వధూవరులను ఉద్దేశించి మాట్లాడిన సీఎం స్టాలిన్… కొత్తగా వివాహం చేసుకున్నవారు ఎక్కువమంది పిల్లలకు జన్మనివ్వాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 16 మంది పిల్లల్ని కానాల్సిన అవసరముందని స్టాలిన్ వివరించారు.
పూర్వకాలంలో నూతన వధూవరులను పెద్దలు ఆశీర్వదించేటప్పుడు 16 రకాల సంపదలు కలిగి సుభిక్షంగా జీవించాలని దీవించేవారు. అంటే 16 రకాల సంపదలను కలిగి ఉండాలని అర్దం. వీటిని ప్రశంసలు, పంట, నీరు, ఆస్తి, బంగారం, వాహనం, జ్ఞానం, ఆవు, ఇల్లు, పిల్లలు, విద్య, జిజ్ఞాస, క్రమశిక్షణ, భూమి, వయస్సు అని ప్రముఖ రచయిత విశ్వనాథన్ తన బుక్ లో పేర్కొన్నారని” స్టాలిన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కానీ ఇప్పుడు 16 రకాల సంపదలను పొందాలని పెద్దలెవరూ దీవించడం లేదని చెప్పిన సీఎం స్టాలిన్. పిల్లల్ని కని.. అన్యోన్యంగా ఉంటే చాలని దీవిస్తున్నారని చెప్పుకొచ్చారు. దీని వల్ల పార్లమెంటరీ నియోజకవర్గం తగ్గించే అవకాశం ఉంటుందని. అందువల్ల 16 మంది పిల్లల్ని మనం కనాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని అభిప్రాయపడ్డారు. దీనిని ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దని స్టాలిన్ ముగించారు.
కాగా గతంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. జనాభాలో సమతుల్యం కోసం ఎక్కువమంది పిల్లల్ని కలిగి ఉండాలని సూచించారు. అయితే ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ ఏకంగా 16మంది పిల్లలను కనమని చెప్పడం హాట్ టాపిక్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.