మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మహా సంగ్రామాన్ని తలపించాయి. దేశ ఆర్థిక రంగానికి గుండెకాయ వంటి ముంబాయి నగరాన్ని రాజధానిగా కలిగి ఉన్న రాష్ట్రంలో..జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. నిజానికి 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలయిన శివసేన, ఎన్సీపీలు చీలిపోయి.. బీజేపీ, కాంగ్రెస్ పంచన చెరో వర్గం చేరడంతో 2024 అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారినట్లు నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది.. ఎవరిని ముఖ్యమంత్రి పదవి వరిస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎవరికి వారే గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తుండగా..ఇటు లోకల్ సర్వేల నుంచి నేషనల్ సర్వేలు తమతమ సర్వేల ఫలితాలను చెబుతూ తాము చెప్పిందే నిజమవుతుందంటూ ధీమాగా చెబుతున్నాయి. తాజాగా పీపుల్స్ పల్స్ సంస్థ ..మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన ( ఏక్ నాథ్ షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్)ల కూటమి మహాయుతి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
బీజేపీ, శివసేన , ఎన్సీపీ పార్టీలతో కూడిన మహాయుతి ఒక కూటమిగా.. కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్ ఠాక్రే ), ఎన్సీపీ పార్టీలతో కూడిన మహా వికాస్ అఘాఢీ(ఎమ్వీఏ) మరో కూటమిగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడ్డాయి. ఈ ఎన్నికల ఫలితాలపై క్షేత్రస్థాయిలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో.. మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని తేల్చింది.
288 స్థానాలున్న మహారాష్ట్రలో మెజార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145 అయితే .. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం మహాయుతి కూటమికి 182 అంటే..175 నుంచి 195 సీట్లు, ఎంవీఏ కూటమికి 97 అంటే 85 నుంచి 112 సీట్లు, ఇతరులకు 9 అంటే..7 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి.
మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ లో వెల్లడైంది. బీజేపీ 113 అంటే 102 నుంచి 120 స్థానాలు, శివసేన పార్టీ 52 అంటే 42 నుంచి 61 స్థానాలు, ఎన్సీపీ పార్టీ 17 అంటే 14 నుంచి 2 స్థానాలు గెలుచుకుంటుందని తేల్చింది. మరోవైపు, కాంగ్రెస్ 35 అంటే 24 నుంచి 44 స్థానాలు, శివసేన 27 అంటే 21 నుంచి 36 స్థానాలు, ఎన్సీపీ 35 అంటే 28 నుంచి 41 స్థానాలు, ఇతరులు 9 అంటే 6 నుంచి 12 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని పీపుల్స్ పల్స్ తేల్చింది. మరి ఈ ఎగ్జిట్ పోల్ ఎంత వరకూ నిజమవుతాయో తెలియాలంటే ఫలితాలు వచ్చేవరకూ వేచి చూడాల్సిందే.