భారత్‌లో ప్రస్తుతం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అనేవి ప్రతీ చిన్న విషయానికి తప్పని సరి అయ్యాయి. ఆర్థిక పరమైన లావాదేవీలకు అయితే కచ్చితంగా ఉండాల్సిందే. అయితే భారత దేశంలో ఆర్థిక, పన్ను వ్యవస్థలను ఆధునికీకరించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం కీలకమైన ఆధార్, పాన్‌కార్డులను అప్‌డేట్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఆధార్ జారీ అయి పదేళ్లు పూర్తయినవారు అప్‌డేట్ చేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. అప్‌డేట్ చేసుకోకపోతే వారి ఆధార్ కార్డు రద్దు చేస్తామని హెచ్చరిస్తోంది. ఇప్పటి వరకూ ఫ్రీ అప్‌డేట్ గడువును నాలుగుసార్లు పెంచింది. ఇక ఆధార్‌తోపాటు మరో ముఖ్యమైన కార్డు పాన్ కార్డు కూడా బ్యాంకు లావాదేవీలకు తప్పనిసరి. దీనిని ఆధార్‌తో అనుసంధానం చేసే పనులుఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి.
అయినా పన్ను ఎగవేతదారులు ఎక్కడా తగ్గడం లేదు. దీంతో పాన్ కార్డ్‌ను అప్‌డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం పాన్ 2.0 ప్రారంభించేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కొత్త కార్డులు లేటెస్ట్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి అందరికీ సేవలందించడానికి ఉపయోగపడతాయని చెప్పారు.
పాన్‌కార్డు అప్‌గ్రేడ్ కోసం కేంద్రం 1,435 కోట్ల రూపాయలు కేటాయిస్తూ..తాజాగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయపు పన్నులో పారదర్శకతను పెంచడానికి పాన్ 2.0 తీసుకురానున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీనిపై కేబినెట్ కమిటీ పాన్ 2.0కు ఆమోదాన్ని తెలిపింది. భద్రతను దృష్టిలో ఉంచుకుని..ఈ పాన్ 2.0 ప్రవేశ పెడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
నిజానికి ఆదాయపు పన్ను ఎగవేత దారులను గుర్తించడానికి ట్యాక్స్ చెల్లింపుల్లో పారదర్శకత కోసం ఆదాయపు పన్ను చట్టంలోని.. సెక్షన్ 139 ఏ కింద 1972లో పాన్ కార్డ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి కూడా పాన్‌కార్డును అప్‌డేట్ చేయలేదు. పాన్ కార్డును డిజిటల్ చేసినా.. పూర్తిస్థాయిలో అప్‌డేట్ చేయలేదు.
అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు 2.0ను అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారతదేశంలో 78 కోట్లకు పైగా సాధారణ పాన్‌కార్డులున్నాయి. కొద్ది రోజుల్లో క్యూఆర్ కోడ్‌తో ఉన్న.. కొత్త పాన్‌కార్డును తాము పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.