ఏపీని వదలని వానగండం

Heavy Rains In Andhra Pradesh

ఈ సంవత్సరం చలికాలంలో కూడా వర్షాకాలం అనుభూతిని పొందారు ఏపీ,తెలంగాణ ప్రజలు. ముఖ్యంగా ఏపీలో గతంలో ఏ చలికాలంలో కూడా కనిపించని వానలు పడ్డాయి. దీంతో కోతలు కోసే టైమ్ కావడంతో ముఖ్యంగా రైతులు ఇబ్బందులు పడ్డారు. తాజాగా మరో వెదర్ అప్ డేట్‌ను వాతావరణ శాఖ అధికారులు విడుదల చేశారు.

తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది డిసెంబర్ 24 నాటికి పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ.. ఉత్తర తమిళనాడు మరియు దక్షిణకోస్తా తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు వివరించారు.

ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం..నిన్న అంటే డిసెంబర్ 22న అదే ప్రాంతంలో కొనసాగింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం.. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ డిసెంబర్ 24 నాటికి ,ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో ఉన్న నైరుతి బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉంది. దీని ఫలితంతో ఏపీలో ఈ రెండు రెండు రోజులు చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది.

డిసెంబర్ 23, సోమవారం రోజు విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, కాకినాడ,, తిరుపతి కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం,నెల్లూరుజిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

అలాగే డిసెంబర్ 24, మంగళవారం రోజు ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.