బిజీబిజీగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన

Chandrababus Busy Delhi Visit,Ap Cm, Chandrababu’S Busy Delhi Visit, Cm Chandrababu, Delhi Tour, Andhra Pradesh, AP Live Updates, AP Politics, Political News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లిన సీఎం..అనంతరం ఎన్డీఏ నేతల సమావేశంలో సైతం పాల్గొంటున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం కూడా ఉంది. దీంతో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

మంగళవారం రాత్రి సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుని అక్కడే బస చేశారు.ఈరోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్ లో నివాళులు అర్పించారు. ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వాజ్ పేయి సమాధి సదైవ్ అటల్ దగ్గర నివాళులు అర్పించి.. ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. అనంతరం హోం మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అవనున్నట్లు తెలుస్తోంది. 2025 ఫిబ్రవరి 1 వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండడంతో.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన డిమాండ్లను ప్రధాని ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన అంశాలను పూర్తి చేయడంపైన కూడా సీఎం చర్చించనున్నారు.

అలాగే ఏపీలో ప్రధాన సమస్యలపై కేంద్ర మంత్రులకు కూడా సీఎం చంద్రబాబు విన్నవించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించడానికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కూడా చంద్రబాబు కలుస్తారని తెలుస్తోంది. ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు చర్చలు జరుపుతారని.. ఏపీకి సంబంధించి రావాల్సిన ఆర్థిక అంశాలపైన వినతి పత్రం ఇస్తారని తెలుస్తోంది.

మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతల సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ సమావేశాలు, రాబోయే ఢిల్లీ, బీహార్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించనున్నారు. అలాగే ఎన్డీఏ తదుపరి కార్యాచరణపైనా చర్చలు జరిపి కీలక నిర్ణయాలను తీసుకున్నారు.ముఖ్యంగా జమిలి ఎన్నికల బిల్లు, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన కొత్త సంస్కరణలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.