తెలుగు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఇటీవల విజయవాడలోని కేసరపల్లిలో జరిగిన విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన హైందవ శంఖారావం సభలో హైందవ ధర్మంపై జరుగుతున్న దాడులపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హిందూ పురాణాలు, ఇతి హాసాలను వక్రీకరించి సినిమాల్లో చూపించడాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, ఇటువంటి చిత్రాలను ప్రభుత్వం వెంటనే బహిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు.
సభలో చేసిన కీలక వ్యాఖ్యలు:
“సినీ రంగం తరపున క్షమాపణలు చెబుతున్నా” హిందూ ధర్మాన్ని అవమానించే విధంగా చిత్రీకరణకు సిగ్గుపడుతున్నానని, సినిమాలు హైందవ ధర్మానికి గౌరవం తగ్గించడంపై విమర్శలు గుప్పించారు.
పురాణాల వక్రీకరణ:
కల్కి 2898 A.D. సినిమాలో కర్ణుడి పాత్రను అనవసరంగా మహిమగాంచడం చూసి సిగ్గుపడుతున్నానని తెలిపారు. నిండు సభలో ద్రౌపది వివస్త్రం చేస్తూ మౌనంగా ఉన్న వ్యక్తిని శూరుడిగా చిత్రీకరించడం సరైనదేనా? అని ప్రశ్నించారు.
ఇస్కాన్ నినాదాలకు అవమానం: ‘‘ధమ్ అరే ధమ్.. హరే రామ హరే కృష్ణ’’ అంటూ ఐటెం పాటలో హిందూ నినాదాన్ని వక్రీకరించడాన్ని కూడా ప్రస్తావించారు.
విమర్శలు చేయడమే నా కర్తవ్యం: “సినిమా ఒక వ్యాపారాత్మక కళ. కానీ, ఈ కళను ఉపయోగించి హైందవ ధర్మాన్ని దూషించడం అన్యాయం” అని అన్నారు.
అనంత శ్రీరామ్ ఓ సంఘటనను ప్రస్తావిస్తూ, తన రాసిన పాటలో “బ్రహ్మాండ నాయకుడు” అనే పదాన్ని తీసేయమని ఒత్తిడి చేశారని, ఆ సందర్భంలో ఆ మ్యూజిక్ డైరెక్టర్‌కు తన జీవితంలో ఇంకెప్పుడూ పాట రాయకూడదని ప్రతిజ్ఞ చేశానని తెలిపారు. 15 ఏళ్లుగా ఆ వ్యక్తితో పని చేయడం లేదని చెప్పారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ‘‘హరే రామ హరే కృష్ణ’’ పాటను ఉదాహరణగా చూపుతూ, పాటల ద్వారా మార్పు తేవడం అంటే అలా ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అనంత శ్రీరామ్ తన ప్రసంగం ద్వారా హిందూ సంఘాలకు పిలుపునిచ్చారు. హైందవ ధర్మాన్ని కించపరిచే సినిమాలను ప్రత్యేకంగా బహిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ చర్యల ద్వారా మాత్రమే ధర్మానికి గౌరవం నెలకొంటుందని అభిప్రాయపడ్డారు.