సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ 7,200 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాలు, ఇతర పొరుగు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అదనపు బస్సులు నడపనున్నారు. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 8 నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. పండుగ పూర్తి తర్వాత తిరుగు ప్రయాణం కోసం జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు 3,200 బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
హైదరాబాద్ నుంచి 2,153 బస్సులు, బెంగళూరు నుంచి 375 బస్సులు, విజయవాడ నుంచి 300 అదనపు బస్సులను నడపనున్నారు. పండుగ సీజన్‌కి ముందు, తర్వాత ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రైళ్లలో వేరే ఛాన్సే లేకపోతే, ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ భారం నుండి బయటపడేందుకు ఈ బస్సులు మంచి ప్రత్యామ్నాయం.
అదనపు ఛార్జీలు లేవు, రాయితీలు కలవు
ఈ ప్రత్యేక బస్సులలో ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. రానుపోనూ టికెట్ బుక్ చేసుకుంటే 10% రాయితీ కూడా లభిస్తుంది. ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందస్తు టికెట్ బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపారు.
సంక్రాంతి రద్దీకి సన్నద్ధం
పండుగ సందర్భంగా సొంతూర్లకు వెళ్లే వారికి ఈ బస్సులు చాలా ఉపయుక్తం అవుతాయి. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ వంటి ప్రధాన కేంద్రాల నుండి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక బస్సుల సేవలు అందుబాటులో ఉంటాయి. పండుగ సీజన్ అంటే ప్రయాణాల హడావుడి తప్పనిసరి.