గన్ కల్చర్‌కు ట్రంప్ చెక్ పెడతారా?

Will Trump Check Gun Culture

ట్రంప్‌కా హుకుం అంటూ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టారు.అయితే ఇలాంటి సమయంలోనే ఆయనకు ఎక్కువగా మద్దతు తెలిపిన ఎన్ఆర్ఐలకు భద్రత ఎలా ఉంటుందనే ప్రశ్న వినిపిస్తోంది. ముఖ్యంగా భారతీయ అమెరికన్లకు సెక్యూరిటీ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఎలా వ్యవహరిస్తారనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతోంది.

నిజానికి గన్ కల్చర్‌కు పెట్టింది పేరు అమెరికా అన్నట్లుగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. మాస్‌ ఫైరింగ్ జరిగిన ప్రతీసారి గన్‌ కల్చర్‌పై గట్టిగా చర్చలు నడిచినా.. ఆ తర్వాత ఎందుకో సైలెంట్ అయిపోతుంది అగ్రరాజ్యం. ఈ కాల్పుల్లో మాత్రం ఇండియన్స్, అది కూడా తెలుగు వారు ప్రాణాలు కోల్పోవడం రెండు తెలుగు రాష్ట్రాలలో ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో ఏడాదిలో నలుగురికి పైగా తెలుగువారుచనిపోయారు.

తాజాగా హైదరాబాద్‌ చైతన్యపురి ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన రవితేజపై దుండగులు కాల్పులు జరపడంతో అతను చనిపోయాడు. 2022 మార్చిలో ఉన్నత చదువుల కోసం రవితేజ అమెరికాకు వెళ్లాడు. మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న రవితేజపై అమెరికాలోని వాషింగ్టన్‌ ఏస్‌లో ఆదివారం రాత్రి ఒక్కసారిగా యువకుడిపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన రవితేజ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.

గతేడాది నవంబర్ 29న ఖమ్మానికి చెందిన సాయితేజ చికాగోలో దారుణ హత్యకు గురయ్యాడు. ఎంఎస్ చదువుతూ షాపింగ్ మాల్‌లో స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్న సమయంలో సాయితేజపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు . దాంతో అక్కడికక్కడే సాయితేజ ప్రాణాలు కోల్పోయాడు. అలాగే 2024 నవంబర్ 22న అమెరికాలోని అట్లాంటాలో ప్రవాస భారతీయ ప్రొఫెసర్‌, వ్యాపారవేత్త అయిన శ్రీరాం సింగ్‌ హత్యకు గురయ్యారు. ఓ కార్యక్రమానికి హాజరవ్వడానికి కారులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపారు. యూపీ తుల్సీపుర్‌ గ్రామానికి చెందిన ఆయన ..ఎన్నో ఏళ్ల కిందట అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

అలాగే 2024 ఆగస్టు 16న హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఏరుగొండ రాజేష్‌ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. మిసిసిపి స్టేట్‌లోని డీన్‌ మెమోరియల్‌ ప్యునరల్‌ హోమ్‌లో ఉంటూ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న రాజేష్‌ హత్యకు గురయ్యాడు. అంతేకాదు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అభిజిత్ కూడా 2024 మార్చిలో అమెరికాలో హత్యకు గురయ్యాడు. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన అభిజిత్.. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతుండగా.. అదే వర్సిటీ ప్రాంగణంలో గుర్తు తెలియని దుండగులు అభిజిత్ చేతిలో హత్యకు గురయ్యాడు.

కాగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. దీంతో ట్రంప్ వచ్చాకైనా..అమెరికాలో గన్ కల్చర్‌కు చెక్ పడి పరిస్థితి అదుపులోకి వస్తుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఇండియన్స్ విషయంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.