కొత్త ఏడాది ప్రారంభమై నెల గడవకముందే బెంగళూరులో తొలి మంకీ ఫాక్స్ (Mpox) కేసు నమోదైంది. దుబాయ్ నుంచి వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి Mpox పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం అతడిని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడు ప్రయాణించిన బెంగళూరు విమానంలోని కాంటాక్ట్ లిస్ట్‌ను అధికారులు ట్రాక్ చేస్తూ, వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారు.
గతేడాది Mpox ఇన్ఫెక్షన్ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించింది. 2024 ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) Mpox ను ప్రపంచ అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. Mpox మొదటిసారి సెప్టెంబర్ 2023లో కాంగోలో బయటపడింది. ఆఫ్రికా సహా స్వీడన్, థాయ్‌లాండ్, బ్రిటన్ వంటి పలు దేశాల్లో ఈ కేసులు వేగంగా వ్యాపించాయి. బ్రిటన్‌లో ఇటీవల నమోదైన Mpox క్లాడ్ 1b వేరియంట్ ప్రాణాంతకంగా భావించబడుతోంది, ఇది ప్రత్యేకించి పిల్లలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. మనదేశంలో గతేడాది మూడు Mpox కేసులు నమోదయ్యాయి, ఇవన్నీ క్లాడ్ IIb వేరియంట్‌కు చెందినవి.
Mpox లక్షణాలు జ్వరం, ఒంటిపై బొబ్బలు, శోషరస గ్రంథుల వాపు, మరియు మలంలో రక్తస్రావం వంటివి. ఈ వైరస్ 18 ఏళ్లు పైబడిన వ్యక్తులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. Mpox నివారణకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, 4 వారాల వ్యవధిలో 2 డోసులు ఇవ్వవచ్చు. ఈ వ్యాధి సోకిన వారితో ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉండడం, కలుషిత పదార్థాలు, లేదా వైరస్ సోకిన జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
వైరస్ సోకిన వ్యక్తులకు రెండు నుంచి నాలుగు వారాల పాటు లక్షణాలు కనిపించవచ్చు. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, బలహీనత, మరియు శోషరస కణుపుల్లో వాపు వంటివి ఈ లక్షణాలలో ముఖ్యమైనవి. కొన్నిసార్లు ఈ వైరస్ ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంది.