భారత రాజకీయాల్లో పార్టీ మార్పులు కొత్తవి కావు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, కేసుల నుంచి తప్పించుకునేందుకు, లేదా ఇతర లాభాల కోసం ప్రజాప్రతినిధులు తరచూ పార్టీలు మారుతుంటారు. ఈ తరహా రాజకీయ కల్లోలంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధులు పార్టీ మారాలనుకుంటే ముందుగా పదవికి రాజీనామా చేయాలి అని కోర్టు స్పష్టం చేసింది. రాజీనామా అనంతరం జరిగే ఎన్నికల్లో తిరిగి గెలిచి చూపించాలని వ్యాఖ్యానించింది. అప్పుడే ప్రజాస్వామ్య నైతికతకు అసలైన అర్థం ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.
కేరళలోని కూతట్టుకులం నగర మునిసిపల్ ఛైర్మన్‌పై ప్రతిపక్ష యూడీఎఫ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే, ఎల్డీఎఫ్ కౌన్సిలర్ కళా రాజు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయనుందని అనుమానంతో ఆమె సొంత పార్టీ నేతలే కిడ్నాప్ చేశారు. మరోవైపు యూడీఎఫ్ కూడా అధికార పార్టీకి చెందిన మరో మహిళా కౌన్సిలర్‌ను అపహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు, ప్రజాస్వామ్య విలువలు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, ఒక ప్రజాప్రతినిధి పార్టీ మారాలంటే, ముందుగా తన పదవికి రాజీనామా చేయాలన్న నిబంధన పాటించాలనే తీర్పును వెల్లడించింది.
ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం, “ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధమే అసలు శక్తి. గుంపు దాడులు, హింస, కిడ్నాప్ వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలను అవమానించే చర్యలు” అని పేర్కొంది. ఓ ప్రజాప్రతినిధి ప్రజల మద్దతుతో గెలిచిన తర్వాత ఇతర పార్టీలోకి మారడం ప్రజాభీష్టాన్ని తక్కువగా అంచనా వేయడమే అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి నేతలను గెలిపించాలో? ఓడించాలో ప్రజలకే మంచి తెలుసు అని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పు, దేశవ్యాప్తంగా పార్టీ మార్పులపై కొత్త చర్చను ప్రారంభించనుంది. రాజకీయ స్థిరత్వానికి, ప్రజాస్వామ్య నైతికతకు ఇది బలమైన సందేశమని విశ్లేషకులు భావిస్తున్నారు.