ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. వసంత పంచమి సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల భక్తులు పోటీపడి పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే ఇప్పటి వరకూ మహా కుంభమేళాకి 35 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మౌని అమావాస్యతో పాటు వసంత పంచమికి రికార్డు స్థాయిలో భక్తులు వచ్చారని అంటున్నారు.
వసంతపంచమి కోసం ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 3 వ తేదీలలో 6 కోట్ల మంది వరకూ భక్తులు మహా కుంభమేళాకు వచ్చారు. 144 ఏళ్ల తర్వాత వచ్చిన మహాకుంభ్ కాబట్టి భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలకు పోటీ పడి వస్తున్నారు.మహా కుంభమేళాకి మరో 22 రోజుల సమయం ఉంది. ఈ మిగిలిన ఈ రోజుల్లో కనీసం మరో 6 నుంచి 7 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఈ సారి ఎక్కువగా తరలి వస్తుండడం విశేషం.
అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు తెచ్చుకున్న మహా కుంభమేళాకు వెళ్లడం ఎంతో పుణ్యమని భక్తులు నమ్ముతారు. ఈ ఏడాది జనవరి 13న మొదలైన మహా కుంభమేళా..ఫిబ్రవరి 26వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొడుతున్న మహాకుంభమేళా ఉత్సవం..రాబోయే రోజుల్లో మరెన్నో రికార్డులు సాధిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించిన యోగి సర్కార్.. అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాట్లు చేయడంతో పాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది.
కాగా..మౌని అమావాస్య రోజు సుమారు 8 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్టు అధికారులు వెల్లడించారు. మకర సంక్రాంతి రోజు 3.5 కోట్ల మంది, జనవరి 30వ తేదీన రెండు కోట్ల మంది, వసంత పంచమికి సుమారు 6 కోట్లమంది భక్తులు వచ్చారు. సాధారణ భక్తులతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా త్రివేణి సంగమంలో నదీ స్నానం చేశారు.