ఏపీ, తెలంగాణ మందుబాబులకు షాక్ తగిలింది. లిక్కర్ ధరలు పెంచుతూ ఏపీ ,తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. రూ.99కు అమ్మే బ్రాండ్ , బీర్ తప్ప.. మిగిలిన అన్ని కేటగిరీల మద్యం ధరలను సవరిస్తున్నట్లు తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు తెలంగాణలో కూడా బీరు ధరలు పెరిగాయి.
తెలంగాణలో బీరు ధరలు 15 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్వర్వులు వచ్చాయి. బేసిక్ ప్రైస్ ను పెంచుతూ ఎక్సైజ్ శాఖ కూడా కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అన్ని బ్రాండ్ల బీర్ల గరిష్ట చిల్లర ధర ఎమ్మార్పీలో సుమారు 15% పెరుగుదల కనిపించబోతోంది.
లైట్ బీరు ధర 150 రూపాయల నుంచి 180 రూపాయలకి, స్ట్రాంగ్ బీరు ధర 160 రూపాయల నుంచి 190 రూపాయలకి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రౌండింగ్ ఆఫ్ విధానాన్ని అనుసరించే ప్రభుత్వ ధోరణి వల్ల కచ్చితమైన పెంపు వివరాలపై ఈరోజు క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.
అయితే కొత్త స్టాక్‌కు కొత్త ధరలు వర్తిస్తాయి. పాత స్టాక్‌కు మాత్రం మార్పుల్లేవు. అంటే ఈరోజు నుంచి వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు డిపోల్లో చేరే కొత్త స్టాక్ కొత్త ధరలకు విక్రయించాలి. సోమవారం నాటికి డిపోల నుంచి పంపిణీ చేసిన బీర్లను మాత్రం పాత రేటుకే అమ్మాల్సి ఉంటుంది.
బేసిక్ ధర పెంపు, బకాయిల చెల్లింపుల విషయంలో గతంలో బీర్ల తయారీ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ముఖ్యంగా కింగ్‌ఫిషర్ బ్రాండ్ కొంతకాలం సరఫరా కూడా నిలిపివేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం ధరల నిర్ణాయక కమిటీ సిఫారసులతో ప్రాథమిక ధర పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది.ఈ ధరల పెంపుతో మద్యం వినియోగదారులపై అదనపు భారం పడబోతోంది. కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి రానుంది.
ఏపీలో 99 లిక్కర్, బీరు తప్ప మిగిలిన అన్ని కేటగిరీల్లో రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. లిక్కర్ రేటు బాటిల్‌పై 10 మాత్రమే పెరిగినట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. బ్రాండ్, సైజ్‌తో సంబంధం లేకుండా బాటిల్‌పై కేవలం 10 రూపాయలు మాత్రమే పెంచినట్లు చెప్పారు. 99 రూపాయల లిక్కర్, బీరు ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదని.. ధరలను మద్యం షాపులన్నీ కూడా డిస్ ప్లే చేయాలని చెప్పారు.