భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో కీలక సమావేశానికి సిద్ధమవుతున్నారు. ఒకరినొకరు స్నేహితులుగా సంబోధించే ఈ నేతల భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ట్రంప్ దూకుడుగా పాలన సాగిస్తుండగా, మోదీ హ్యాట్రిక్ టర్మ్‌లో ఉన్న నేపథ్యంలో వారి చర్చలు కీలకంగా మారాయి. ముఖ్యంగా డిపోర్టేషన్ మరియు వాణిజ్య సంబంధాల అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది.
అమెరికా 47వ అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ట్రంప్ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఆయన పాలనలో ప్రభుత్వ రంగాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అంతేకాదు, అమెరికాలో వలస పాలసీని కఠినతరం చేస్తూ, అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా, అమెరికాలో ఉన్న 7.25 లక్షల మంది భారతీయ అక్రమ వలసదారులపై కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 18,000 మందిని నిర్బంధించి, 104 మందిని ప్రత్యేక విమానాల్లో ఇండియాకు పంపించారు. దీని ద్వారా ట్రంప్ ప్రభుత్వ తీవ్రత స్పష్టమవుతోంది.
ఇక వీసా నియమాలు మరింత కఠినతరం అవుతున్నాయి. ముఖ్యంగా H1B వీసాపై ట్రంప్ ప్రత్యేక దృష్టి సారించారు. గరిష్ట వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు మాత్రమే వీసా మంజూరు చేయాలని, వార్షిక పరిమితిని 75,000కు కుదించాలని ప్రతిపాదనలు వచ్చాయి. అదనంగా, విద్యార్థులకు మంజూరు చేసే F1, M1 వీసాలపై కూడా కఠిన నియమాలు అమలు చేయాలని యోచిస్తున్నారు, తద్వారా వారు చదువు పూర్తయ్యాక తక్షణమే స్వదేశానికి తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు.
వాణిజ్య పరంగా, అమెరికా భారతదేశానికి అతిపెద్ద భాగస్వామిగా ఉంది. 2023-24లో ఇరు దేశాల మధ్య 118 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. అయితే, అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. భారత్‌ను “టారిఫ్ కింగ్”గా అభివర్ణించిన ఆయన, వాణిజ్య అనుసంధానం పై మరింత సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు.
ఈ భేటీలో ప్రధానంగా భారతీయుల డిపోర్టేషన్, వాణిజ్య సంబంధాలు, రక్షణ, సాంకేతిక సహకారం, దిగుమతులపై సుంకాల అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ దృష్టి మరలిన ఈ సమావేశం నుంచి ఏమి తేలుతుందో వేచి చూడాలి!