కొత్త సీఈసీ.. జ్ఞానేశ్‌కుమార్‌

New CEC Gyanesh Kumar

ప్రస్తుత ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ పదవీ కాలం ఫిబ్రవరి 18తో ముగియడంతో.. కేంద్ర న్యాయశాఖ కొత్త సీఈసీని నియమించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్‌కుమార్‌ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఎన్నికల కమిషనర్ల నియామకంపై తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం తొలి సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్‌ నియమితులయ్యారు.

కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి..జ్ఞానేశ్‌కుమార్‌. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జ్ఞానేశ్‌కుమార్‌.. ముగ్గురు కమిషనర్లలో రెండో సీనియర్‌గా ఉన్నారు. మరో కమిషనర్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ ఉత్తరాఖండ్‌ కేడర్‌కు చెందిన వారు. జ్ఞానేశ్‌కుమార్‌ కేంద్ర హోంశాఖలో వివిధ విభాగాల్లో పనిచేశారు. కశ్మీర్‌ డివిజన్‌ జాయింట్‌ సెక్రెటరీగా ఉన్న జ్ఞానేశ్‌కుమార్‌ ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించిన ముసాయిదా బిల్లు రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.

సుప్రీం కోర్టులో అయోధ్య రామజన్మభూమి కేసుకు చెందిన డాక్యుమెంట్లను నిర్వహణ బాధ్యతను జ్ఞానేశ్‌కుమార్‌ వహించారు. గతేడాది జనవరిలో కేంద్ర సర్వీసుల నుంచి జ్ఞానేశ్‌కుమార్‌ రిటైర్‌ అయ్యారు. గతంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా అత్యంత సీనియారిటీ ఉన్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్లను నియమించేవారు. కాగా గతేడాది కొత్త చట్టం అమలులోకి రావడంతో దీనిప్రకారం.. సీఈసీ, ఈసీల నియామకాలకు సంబంధించిన అన్వేషణ కమిటీ ఐదుగురు కార్యదర్శి స్థాయి అధికారుల పేర్లతో తుది జాబితాను సిద్ధం చేస్తుంది. తర్వాత పీఎం నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశంలో సీఈసీ, ఈసీలను నియమిస్తుంది.