మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా అసౌకర్యం కలగకుండా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలకు 3,000 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ఈ ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశాయి.
హైదరాబాద్ ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్ వంటి ప్రాంతాల నుంచి శ్రీశైలం, వేములవాడకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రయాణికుల కోసం షామియానాలు, తాగునీరు, ప్రజల సమాచారం కోసం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు.
ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ సవరించింది. రెగ్యులర్ బస్సుల ఛార్జీలలో మార్పు లేదు కానీ, స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన ఛార్జీలు అమల్లో ఉంటాయి. 24 నుంచి 27 వరకు స్పెషల్ సర్వీసుల టికెట్ ధరలు పెంచగా, ఏడుపాయలకు వెళ్తున్న బస్సులకు 26 నుంచి 28 వరకు కొత్త ధరలు వర్తిస్తాయి.
అదనంగా, రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సదుపాయం వర్తిస్తుంది. మహిళలు తప్పనిసరిగా ‘జీరో టికెట్’ తీసుకోవాలని అధికారులు సూచించారు.
అంతేకాక, హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, టికెట్లు www.tgsrtcbus.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించవచ్చని సూచించారు.