టెక్నాలజీ అభివృద్ధితో హైటెక్ కాపీయింగ్ మరింత పెరుగుతోంది. ప్రస్తుతం పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థులు మరియు అధికారులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. మార్చి 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభంకానుండగా, పరీక్షల నిర్వహణలో కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చారు.
సాధారణంగా, ఎగ్జామ్ హాళ్లలో ఎలక్ట్రానిక్ పరికరాలు, డిజిటల్ వాచ్‌లను అనుమతించరు. అయితే గతంలో అనలాగ్ వాచ్‌లు ధరించేందుకు అనుమతి ఉండేది. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో, అనలాగ్ వాచ్‌లను కూడా కాపీయింగ్‌కు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ ఏడాది నుంచి పరీక్ష హాళ్లలో అనలాగ్ వాచ్‌లను కూడా నిషేధించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఫిబ్రవరి 28న తెలంగాణ సీఎస్ శాంతి కుమారి పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా, పరీక్ష హాల్లో అనలాగ్ వాచ్‌లను కూడా అనుమతించరాదని నిర్ణయించారు. అయితే పరీక్షా సమయంలో విద్యార్థులు సమయాన్ని గమనించేలా ప్రతి 30 నిమిషాలకు అలారం మోగించడంతో పాటు, ఇన్విజిలేటర్లు సమయాన్ని ప్రకటిస్తారని అధికారులు తెలిపారు.
తల్లిదండ్రులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, పొరపాటున విద్యార్థులు వాచ్‌లు తెచ్చినా, వాటిని భద్రపరిచేందుకు లాకర్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. విద్యార్థులు ఈ మార్గదర్శకాలను అనుసరించి, ఎటువంటి గడియారం లేకుండానే పరీక్షలకు హాజరవ్వాలని సూచిస్తున్నారు.