నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందించేందుకు రేవంత్ సర్కార్ మరో కీలక పథకాన్ని అమలు చేయనుంది. రూ.6 వేల కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్చి 2న ప్రారంభించనున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకానికి సంబంధించిన యూనిట్ల పంపిణీ కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. బ్యాంకర్లు ఈ రుణాల మంజూరుకు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) సమావేశంలో పాల్గొన్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ దేశాలను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. స్కిల్స్ యూనివర్సిటీ, ఐటీఐల అభివృద్ధి, నైపుణ్యాల పెంపు, నిరంతర నాణ్యమైన విద్యుత్తు సరఫరా, చక్కటి శాంతిభద్రతలు, అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని పేర్కొన్నారు. దావోస్‌లో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించామని, ప్రాంతీయ రింగ్ రోడ్డు పూర్తయితే పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి డిమాండ్
తెలంగాణలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయా యూనివర్సిటీల పరిశోధకుల సమితి నేతలు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ను కోరారు. హైదరాబాద్‌లో ఐక్యకార్యాచరణ సమితి నేతలు శ్రీధర్, ఆనంద్, ప్రవీణ్ తదితరులు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయకుండా, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రొఫెసర్ల వయోపరిమితి పెంచేందుకు యత్నాలు జరుగుతున్నాయని, ఇది అన్యాయమని వారు ఆరోపించారు. ఖాళీలను భర్తీ చేయడమే సమర్థ్యమైన పరిష్కారమని నేతలు తెలిపారు.