ఉమ్మడి కరీంనగర్ లో ప్రతి గ్రామం, ప్రతి ఎకరం, గోదావరి జలాలతో అనుసంధానం కావాలి: సీఎం కేసీఆర్

CM KCR held Review Meeting on Irrigation Projects of the Combined Karimnagar District, CM KCR reviews status of irrigation projects, Irrigation Projects In Karimnagar, Irrigation Projects of the Combined Karimnagar District, Kaleshwaram built despite hurdles, Kaleshwaram lift irrigation project, KCR Review Meeting, KCR Review Meeting on Irrigation Projects, KLIS water for tail end areas of Karimnagar, Mango News, Telangana CM KCR, Telangana constructed Kaleshwaram project

గోదావరి నదీజలాలు ఒరుసుకుంటూ పోతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామము, ప్రతి ఎకరం, గోదావరి సాగునీటి జలాలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అనంతరం, సిరిసిల్ల జిల్లా తెలంగాణ జలకూడలిగా మారిందన్నారు. సిరిసిల్ల సహా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల పరిధిలో ఏ మూలనా సాగునీటి సమస్య ఉత్పన్నం కాకూడదని సీఎం తెలిపారు. సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సాగునీటి పారుదలపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ’’గోదావరి నదీ జలాలను తెలంగాణ సాగుభూములకు మళ్లించడానికి ప్రాణహితను ఆధారం చేసుకుని కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులు, రిజర్వాయర్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎన్నో కష్టాలుపడి లిప్టుల ద్వారా సాగునీటిని ఎత్తిపోసుకొని తెలంగాణను సస్యశ్యామలం చేసుకుంటున్నాము. ప్రాణహిత నుంచే కాకుండా ఎల్లంపల్లి ఎగువ నుంచి కూడా గోదావరి జలాల లభ్యత పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి జలాలను పూర్తి సామర్ధ్యంతో వినియోగించుకోవాల్సిన అవసరమున్నది. కరువు వచ్చినపుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యత మరింత అర్థమవుతుంది. అటువంటి కరువు కష్టాలను అధిగమించడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్నం. ఇక నుంచి కరువుకు కాలానికి సంబంధం లేకుండా ఏ కాలం లోనైనా పుష్కలంగా నీళ్లు లభించేలా ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పుడు నీళ్ళు మన చేతిలో ఉన్నయ్. వాటిని ఎట్లా వాడుకుంటామనేదే తెలివితో ముడిపడి ఉంది‘ అని సీఎం అన్నారు.

నీళ్లను ఎత్తిపోసి నిండుకుండలా జలాశయాలను నిర్మించుకున్న తర్వాత కూడా గోదావరి పరివాహక ప్రాంతాలైన కరీంనగర్, వరంగల్, అదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాగునీటి సమస్య అనేమాటే వినబడకూడదని సీఎం అన్నారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లా జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో గోదావరి జలాలు మూలమూలనా ప్రవహించాలన్నారు. అందుకు చిన్నపాటి లిఫ్టులు ఏర్పాటు చేసుకొని వానాకాలం ప్రారంభంలోనే నదీజలాలను ముందుగా ఎత్తైన ప్రదేశాలకు ఎత్తిపోసుకోవాలన్నారు. ఎత్తు మీదినుంచి తిరిగి గ్రావిటీ విధానం ద్వారా (మిషన్ భగీరథ పద్ధతిలో) సాగునీటిని పొలాలకు మళ్లించుకోవాలన్నారు. మిషన్ కాకతీయ తర్వాత అన్ని నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలు పటిష్టంగా మారిన నేపథ్యంలో వాటిని ముందుగా గోదావరి జలాలతో నింపుకోవాలన్నారు. ఈ రాడార్ పరిధిలో అన్ని చెరువులను నూటికి నూరు శాతం నింపాలని సీఎం తెలిపారు. ’’నేను కష్టపడి నీళ్లు తెచ్చిపెట్టిన. వాటిని వినియోగించుకునే బాధ్యత మీదే‘‘ అని స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇంజనీర్లకు సీఎం స్పష్టం చేశారు.

జూలై 10 తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, మండలస్థాయి ఇరిగేషన్ అధికారులు కూర్చొని, సాగు నీరును మూలనా ఎట్లా పారించాలో చర్చలు జరపాలన్నారు. కాంటూర్ లెవల్స్, ఎంఎండిఎల్ తో సహా అన్ని రకాల సాంకేతిక అంశాల పట్ల అవగాహన పెంచుకొని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ఒక్క గ్రామమూ, ఒక్క ఎకరమూ వదలకుండా తడిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు సహా ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. నెత్తిమీద నీళ్లు పెట్టుకొని కరీంనగర్ జిల్లా బాధపడటం సరికాదన్నారు. అప్పర్ మానేరు కరీంనగర్ జిల్లా వరదాయని అని, అప్పర్ మానేర్ కు పూర్వ వైభవం తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. ఇకనుంచి కరీంనగర్ జిల్లాలో రైతులు రోహిణీ కార్తెలోనే నాటు వేసుకునేలా చూసే బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులేనన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ టెయిల్ ఎండ్ ప్రాంతాల్లోనే నీటి లభ్యత పుష్కలంగా ఉన్నప్పుడు, ప్రాజెక్టుల పక్కన, రిజర్వాయర్ల వెంట ఉన్న బాల్కొండ, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, చొప్పదండి, ధర్మపురి, కరీంనగర్, మానకొండూర్, రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో నీరు లభించకపోవడమేమిటి అని ప్రశ్నించారు. ఎత్తైన ప్రదేశాల్లో కూడా నీరు అందేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో ప్రతి ఎకరానికి తెలివితో సాగునీటిని సాధించుకోవాలన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు కూర్చొని నివేదికను సిద్ధంచేసి తనకు అందించాలని సీఎం తెలిపారు. మానకొండూరు నియోజకవర్గ పరిధిలో సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సీఎంను అభ్యర్థించారు. అందుకు సానుకూలంగా స్పందించిన సీఎం, ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే మానకొండూరు నియోజకవర్గ పరిధిలో ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరిని సందర్శిస్తానని సీఎం తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతుల విజ్ఞప్తి మేరకు నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఐ.టి మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్ అండ్ బి శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్, రఘోత్తం రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, విద్యాసాగర్ రావు, కోరుకంటి చందర్, జెడ్పీ చైర్మన్ ఎన్. అరుణ కుమారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం సెక్రటరి స్మితా సబర్వాల్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, సిరిసిల్లా జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్, ఇ.ఎన్.సి లు వెంకటేశ్వర్లు, హరిరామ్, నీటిపారుదల అధికారులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + ten =