ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమి అనంతరం ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్‌తో జరిగిన చివరి వన్డేలో 73 పరుగులు చేసిన స్మిత్, ఈ ఫార్మాట్‌లో తన కెరీర్‌ను ముగించాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించాడు.
ఈ టోర్నీకి ముందు ఆసీస్ జట్టు గాయాల సమస్యలను ఎదుర్కొంది. కెప్టెన్ పాట్ కమిన్స్ దూరంగా ఉండటంతో, క్రికెట్ బోర్డు స్మిత్‌కు జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అనుభవం లేని ఆటగాళ్లతో ఆడినా, అతని నాయకత్వంలో ఆసీస్ జట్టు గ్రూప్ స్టేజ్‌ను దాటి, సెమీస్ వరకు చేరుకుంది. భారతతో హోరాహోరీగా జరిగిన పోరులో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
రిటైర్మెంట్‌పై స్మిత్ మాట్లాడుతూ, వన్డేల్లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని, 2027 వన్డే వరల్డ్‌కప్ కోసం కొత్త తరానికి అవకాశం ఇవ్వాలనుకున్నానని తెలిపాడు. టెస్టు క్రికెట్‌పై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్, వెస్టిండీస్ టెస్టు సిరీస్‌ల కోసం సిద్ధమవుతున్నట్టు చెప్పాడు.
170 వన్డేల కెరీర్‌లో 5800 పరుగులు చేసిన స్మిత్, 12 సెంచరీలు, 35 అర్ధశతకాలు సాధించాడు. కెప్టెన్‌గా 64 వన్డేల్లో 32 విజయాలు అందించాడు. మైకెల్ క్లార్క్ రిటైర్మెంట్ అనంతరం అతను జట్టును నడిపించాడు. 2015, 2023 వన్డే వరల్డ్‌కప్‌ల విజేత జట్టులో కీలక ఆటగాడిగా నిలిచాడు. లెగ్ స్పిన్నర్‌గా కెరీర్ ప్రారంభించిన అతను 28 వికెట్లు కూడా తీసుకున్నాడు.