యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజల మధ్య దూరం తగ్గిపోయింది. ఏ దేశంలో జరిగిన సంఘటన అయినా క్షణాల్లో ప్రపంచానికి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో యూట్యూబ్ తన వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవం కల్పించేందుకు ఆటో డబ్బింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా భాషా పరమైన అవరోధాలు లేకుండా వినియోగదారులు కంటెంట్‌ను చూడగలుగుతారు. ప్రపంచంలో అనేక భాషలు ఉన్నా, యూట్యూబ్‌లో ఎక్కువగా ఇంగ్లిష్ కంటెంట్ హావా ఉంది. ఇంగ్లిష్ తెలిసినవారికి సమస్య ఉండకపోయినా, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ వంటి భాషలు తెలిసిన వారు మాత్రమే ఆయా భాషల్లోని వీడియోలను అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఆటో డబ్బింగ్ ఫీచర్‌తో ఈ సమస్యను సమర్థంగా అధిగమించవచ్చు.
గూగుల్‌కు చెందిన ఏరియా 120 ఇంక్యూబేటర్‌లో అలైడ్ డెవలప్ చేసిన ఏఐ టెక్నాలజీ ద్వారా ఈ ఆటో డబ్బింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల ఇంగ్లిష్ వీడియోలు ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, స్పానిష్ వంటి భాషల్లోకి అనువదించబడతాయి. అదే విధంగా, ఇతర భాషల్లోని కంటెంట్ కూడా ఇంగ్లిష్‌లోకి డబ్ అవుతుంది, దీంతో ప్రపంచవ్యాప్తంగా మరింత మంది వినియోగదారులకు యూట్యూబ్ కంటెంట్ చేరుతుంది.
యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచే కొత్త ఫీచర్
డబ్ చేసిన కంటెంట్ పై “Auto Dubbed” అనే లేబుల్ కనిపిస్తుంది. వినియోగదారులు ట్రాక్ సెలెక్టర్ ద్వారా ఒరిజినల్ వాయిస్‌ను కూడా వినగలుగుతారు. కొత్త సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని భాషలు జోడించేందుకు యూట్యూబ్ యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. ఈ ఫీచర్ విద్య, వినోదం, సమాచార ప్రసార రంగాల్లో విప్లవాత్మక మార్పును తెస్తుంది. భాషా అవరోధాలను తొలగించి, యూట్యూబ్ కంటెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత చేరువ చేసే ప్రయత్నంలో ఇది గొప్ప ముందడుగు.